కాంగ్రెస్‌పై నెపం.. ఒవైసీ ఆగ్రహం

19 Apr, 2018 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మోదీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి ఆగ్రహం వెలిబుచ్చారు. హిందూ ఉగ్రవాదం గత ప్రభుత్వాల నిర్వాకమేనని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ స్పందించారు. బుధవారం ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘మక్కా మసీదు పేలుడు తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఓ కేసులో బాధితుల తరపు కాకుండా.. నిందితుల వైపు ప్రభుత్వం నిలవటం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కాబోలు. హిందూ ఉగ్రవాదం కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పుట్టిందని బీజేపీ చెబుతోంది. తప్పు మరొకరి మీదకు నెట్టేసి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. అలాంటప్పుడు అజ్వీర్‌ దర్గా పేలుడు కేసులో దేవేంద్ర గుప్తా.. భావేశ్‌ పటేల్‌లు దోషులుగా నిర్ధారణ అయిన విషయాన్ని బీజేపీ మరిచిపోయిందేమో’ అంటూ ఒవైసీ పేర్కొన్నారు. 

ఇక కోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన ఆయన.. ఇది పూర్తిగా ఎన్‌ఐఏ వైఫల్యమని వెల్లడించారు. ‘ ఈ విషయంలో కేంద్రాన్ని నేను హెచ్చరిస్తోంది ఒక్కటే.. నిందితులంతా ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ.. దేశాన్ని ఓ స్మశానంలా మార్చే ప్రమాదం ఉంది’ అని ఒవైసీ పేర్కొన్నారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు బాధిత కుటుంబాలు సుముఖంగా ఉంటే న్యాయ సాయం అందించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

మరిన్ని వార్తలు