ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు

11 Nov, 2023 12:43 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌ దేవ్‌ రూ.447 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 958 మందికిగాను 953 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాలను విశ్లేషించినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫారమ్స్‌(ఏడీఆర్‌)తెలిపింది. అభ్యర్థుల ఆస్తుల సరాసరి రూ.2 కోట్లని తెలిపింది. అత్యంత ధనికులైన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారేనని పేర్కొంది. సుర్‌గ్రుజా రాచకుటుంబ వారసుడైన టీఎస్‌ సింగ్‌ దేవ్‌ రూ.447 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. 

అంబికాపూర్‌ నుంచి పోటీ చేస్తున్న ఈయన 2018 ఎన్నికల సమయంలో రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మణేంద్రగఢ్‌ స్థానంలో పోటీ చేస్తున్న రమేశ్‌ సింగ్‌ రూ.73 కోట్ల పైచిలుకు ఆస్తులు, రజిమ్‌లో పోటీ చేస్తున్న అమితేశ్‌ శుక్లా రూ.48 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ప్రకటించారని వెల్లడించింది. కాంగ్రెస్‌కు చెందిన 70 మంది అభ్యర్థుల్లో 60 (86%)మంది, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 (81%)మంది, జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జే)కి చెందిన 62 మందిలో 26 (42%) మంది, ఆప్‌నకు చెందిన 44 మందిలో 19 (43%) మంది అభ్యర్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారని వివరించింది.

ఆస్తులే లేవన్న ముగ్గురు అభ్యర్థులు
భట్‌గావ్‌ సీటుకు పోటీ చేస్తున్న కళావతి సార్థి, బెల్టారాలో పోటీ చేస్తున్న గౌతమ్‌ ప్రసాద్‌ సాహు అనే స్వతంత్ర అభ్యర్థులు, ఖర్సియాలో పోటీలో ఉన్న జోహార్‌ ఛత్తీస్‌గఢ్‌ పార్టీకి చెందిన యశ్వంత్‌ కుమార్‌ నిషాద్‌ తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. అదేవిధంగా, రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు అతి తక్కువగా ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. ముంగేలి ఎస్‌సీ రిజర్వుడు సీటుకు పోటీ చేస్తున్న నేషనల్‌ యూత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌రత్న ఉయికే తన వద్ద కేవలం రూ.500 ఉన్నట్లు తెలిపారు. రాయ్‌గఢ్‌లో ఆజాద్‌ జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న కాంతి సాహు రూ.1,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా, బెల్టారా బరిలో నిలిచిన ఆజాద్‌ జనతా పార్టీకే చెందిన ముకేశ్‌ కుమార్‌ చంద్రాకర్‌ రూ. 1,500 ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్‌ తెలిపింది.

సీఎం బఘేల్‌కు అత్యధిక ఆదాయం
ఆప్‌ అభ్యర్థి విశాల్‌ కేల్కర్, కాంగ్రెస్‌ నేత, సీఎం భూపేశ్‌ బఘేల్, బీజేపీ నేత ఓపీ చౌధరి తమకు అత్యధిక ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారని ఏడీఆర్‌ పేర్కొంది. కేల్కర్‌ తన మొత్తం ఆదాయం రూ.2 కోట్లుగా, సీఎం బఘేల్, చౌధరిలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు.
52 శాతం మంది 12వ తరగతిలోపే

మొత్తం అభ్యర్థుల్లో 499(52 శాతం) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు తెలపగా మరో 405(42%)మంది గ్రాడ్యుయేషన్‌ ఆపైన చదువుకున్నట్లు వెల్లడించారని ఏడీఆర్‌ విశ్లేషించింది. 19 మంది అక్షరాస్యులమని మాత్రమే తెలపగా, ఆరుగురు నిరక్షరాస్యులమని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు విద్యార్హతలను పేర్కొనలేదు.

మరిన్ని వార్తలు