పాదయాత్రపై బాబు వ్యాఖ్యలు దుర్మార్గం

4 Nov, 2017 02:39 IST|Sakshi

కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

ప్రజాసంకల్ప యాత్రకు మద్దతుగా పులివెందులలో పాదయాత్ర ప్రారంభం

శ్రీవారికి మొక్కుల చెల్లింపుతో ముగిసిన గోపిరెడ్డి పాదయాత్ర

పులివెందుల/ఇబ్రహీంపట్నం, జి.కొండూరు (మైలవరం): ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గమని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు మద్దతుగా స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నుంచి తొండూరు మండలం మల్లేల ఇమాంబి దర్గా వరకు పాదయాత్ర చేపట్టారు.

ఈ పాదయాత్రను స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఎంపీ అవినాశ్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు కొంతమంది పాదయాత్రను అడ్డుకుంటామని అంటుంటే, మరి కొంతమంది పాదయాత్రకు అనుమతి లేదంటున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలు తెలుసుకునే హక్కు జగన్‌కు ఉందనే విషయం వారు గుర్తించాలని హితవు చెప్పారు. పాదయాత్ర ప్రారంభం అనంతరం పట్టణంలోని వెంకటేశ్వరాలయం, మసీదు, సీఎస్‌ఐ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం వద్ద పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
వైఎస్‌ జగన్‌ చేపట్టబోయే ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కృష్ణాజిల్లా జి.కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు శుక్రవారం విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకూ చేపట్టిన పాదయాత్రను ఇబ్రహీంపట్నం పోలీసులు అడ్డుకున్నారు. ఈ పాదయాత్రకు అనుమతిలేదని పోలీసులు చెప్పడంపై పార్టీ నేతలు మండిపడ్డారు.

వెఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌పై రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక మంత్రి దేవినేని ఉమా కుట్రతో పాదయాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఉన్న సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో పూజలుచేసి, జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని నేతలు వేడుకున్నారు. జి.కొండూరులో పాదయాత్రను జోగి రమేశ్‌ ప్రారంభించారు.   


శ్రీవారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా పాదయాత్ర
సాక్షి, తిరుమల: ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలనే ఆకాంక్షతో తాను చేపట్టిన పాదయాత్ర శ్రీవారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా పూర్తయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించారు.

నరసరావుపేటలో ప్రారంభమైన పాదయాత్ర 13 రోజుల పాటు సాగింది. సుమారు 400 కి.మీ నడిచారు. గోపిరెడ్డితో పాటు దాదాపు 200 మంది పార్టీ నేతలు, శ్రేణులు, నియోజవర్గ ప్రజలు కూడా తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు