‘డబుల్‌’పై శ్వేతపత్రం విడుదల చేయాలి

5 Feb, 2018 03:20 IST|Sakshi

బండారు దత్తాత్రేయ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌:  డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం పూర్తిగా విఫలమైనందున దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. నాలుగు సంవత్సరాలు కాలయాపన చేసి లక్షల సంఖ్యలో ఇళ్లను మిగిలిన ఒక్క సంవత్సరంలో నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

అన్ని పథకాల విషయంలోనూ ప్రభుత్వం తీరు ఇలాగే ఉందన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని, వాటి ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లలో పెద్దమొత్తాలు కేటాయించి తక్కువ ఖర్చు చేస్తున్నాయని, కానీ మోదీ ప్రభుత్వం ప్రకటించినదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు. 50 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే ఆరోగ్య పథకం, రైతులకు రుణాలు లాంటివి ఆమ్‌ఆద్మీ బడ్జెట్‌కు నిదర్శనమన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు సరిగా ఇవ్వటం లేదంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాగా వరుసగా రెండేళ్లలో రూ.16,420 కోట్లు, రూ.19,207 కోట్లు విడుదల చేసిందన్నారు. రామగుండం ఎన్టీపీసీకి ఈ బడ్జెట్‌లో రూ.3,877 కోట్లు, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు రూ.5,900 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.   

మరిన్ని వార్తలు