కశ్మీర్‌లో పాక్‌ దురాగతం

5 Feb, 2018 03:19 IST|Sakshi
కుటుంబ సభ్యులతో కపిల్‌ కుందు

కాల్పుల్లో ఓ అధికారి, ముగ్గురు జవాన్ల మృతి

ఆటోమేటిక్‌ ఆయుధాలు, మోర్టార్లతో దాడి

జమ్మూ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ సైన్యం మరోసారి దురాగతానికి తెగబడింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ భారత సైనికులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురిని బలిగొంది. కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒకరు ఆర్మీ లెఫ్టినెంట్‌ అధికారి కాగా, మిగిలిన ముగ్గురు జవాన్లు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్‌ సైనికులు ఆదివారం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆటోమేటిక్‌ తుపాకులు, మోర్టార్లతో పౌర ప్రాంతాలపైనా దాడి చేశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి.

తొలుత ఉదయం 11.10 గంటల ప్రాంతంలో పూంచ్‌లోని షాపూర్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మైనర్లు, ఓ ఆర్మీ జవాన్‌ గాయపడ్డారు. భారత సిబ్బంది తమ తుపాకులతో పాక్‌కు దీటైన సమాధానమిచ్చారని ఓ అధికారి చెప్పారు. రాజౌరీ జిల్లాలోని మధ్యాహ్నం 3.40 గంటలకు భీంభేర్‌ గలీ సెక్టార్‌లోనూ పాక్‌ సైనికులు మోర్టార్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం తరలిస్తుండగా ఆయనా మృత్యువాత పడ్డారు. రాజౌరీలోనూ పాక్‌ కాల్పులకు భారత జవాన్లు దీటుగా సమాధానమిచ్చారు.

ఆరు రోజుల్లో పుట్టినరోజు ఉందనగా...
చనిపోయిన వారిలో వయసురీత్యా అందరికన్నా చిన్నవాడే ఆ అధికారి. హరియాణకు చెందిన కపిల్‌ కుందు (22) ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. మరో ఆరు రోజుల్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే పాక్‌ కాల్పులకు కుందు బలయ్యారు. చనిపోయిన జవాన్లలో కశ్మీర్‌కు చెందిన రోషన్‌ లాల్‌ (42), శుభం సింగ్‌ (23)తోపాటు మధ్య ప్రదేశ్‌కు చెందిన రామావతార్‌ (27) ఉన్నారు. మరోవైపు నియంత్రణ రేఖకు ఐదు కి.మీ. దూరంలో ఉన్న అన్ని పాఠశాలలనూ మూడురోజులపాటు మూసివేస్తున్నట్లు రాజౌరీ ఉప కమిషనర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు