రజనీకే ఆదరణ: కేంద్ర మంత్రి

5 Oct, 2018 11:36 IST|Sakshi
హీరో విజయ్‌

తమిళనాడు, పెరంబూరు: ప్రజల్లో అధిక ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్‌కేనని, లంచగొండులను పట్టిస్తే హీరో విజయ్‌కు పూలమాల వేసి స్వాగతిస్తానని కేంద్రమంత్రి, బీజేపీ నేత పొన్‌రాధాకృష్టన్‌ అన్నారు. తన తాజా చిత్రం సర్కార్‌ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని విజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే వర్గాల్లో ప్రకంపనలు పట్టిస్తున్నాయి. అంతే కాదు విజయ్‌ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ గురువారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ క్రింది విధంగా బదులిచ్చారు.

ప్ర: హైడ్రోకార్బన్‌న పథకానికి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ పోరాటం చేయడంపై మీ స్పందన?
జ:  అది పనిలేని కార్యం. వారు ఏం కావాలో అడిగారా? డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలకు హైడ్రోకార్బన్‌ పథకం గురించి మాట్లాడే అర్హత లేదు,

ప్ర: బీజేపీకి వ్యతిరేకంగా రెండవ స్వాతంత్య్ర పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ వ్యాఖ్యల గురించి?
జ:  వారికి స్వాతంత్య్రం రాదు, ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారు.

ప్ర: ఇటీవల నటుడు విజయ్‌ సీఎంనైతే నిజాయితీగా ఉంటా. నటించను అని అనడం గురించి మీ కామెంట్‌?
జ:  అందరూ ఎంజీఆర్, జయలలితలా కాలేరు. ఇప్పుడు ప్రజల మధ్య ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్‌ మాత్రమే.

ప్ర: బీజేపీ రజనీకాంత్‌ను వెనకేసుకు రావడానికి కారణం?
జ:  ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పలువురు నటులు, పత్రికల వాళ్లు వివిధ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. ఏదో తమిళనాడు దిక్కులేనిదిగా భావిస్తూ రాజకీయాల్లోకి రాకూడదన్నారు. నటుడు విజయ్‌ లంచం గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా అలాంటి లంచగొండులను ఆయన పట్టిస్తే నేను ఆయన వద్దకు నేరుగా వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తాను. రజనీకాంత్‌కు మంచి మనిషి అని ప్రజల్లో పేరు ఉంది.

ప్ర: రజనీకాంత్‌ భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తారా?
జ:  రజనీకాంత్‌ ఇంకా పార్టీనే స్థాపించలేదు. అయినా ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారా? అన్నది తెలియదు.

ప్ర: పార్లమెంట్‌ ఎన్నికలకు మరో 6 నెలల కాలమే ఉంది. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
జ:  ఇప్పటి కంటే కూడా అధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ  గెలుచుకుంటుంది. బీజేపీ 350 స్థానాలను, కూటమితో కలిసి 400లకు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ గద్దెనెక్కుతుంది.

మరిన్ని వార్తలు