హైటెక్‌ దీక్ష

29 Jun, 2018 10:54 IST|Sakshi
నీళ్లు తాగుతున్న సీఎం రమేష్‌

ప్రతిరోజు వీఐపీల తాకిడి.. వరుస క్రమంలో కడపకు చేరుతున్న మంత్రివర్గం

9 రోజులుగా కొనసాగుతోన్న ఎంపీ సిఎం రమేష్‌ ఆమరణదీక్ష

ఇప్పటికీ హుషారుగా ఉండడంపై ఆశ్చర్యచకితులైతోన్న వైద్య నిపుణులు

3వ రోజు 5వరోజుకు బరువులో వ్యత్యాసం కన్పించని వైనం

తర్వాత బ్లడ్‌ రిపోర్ట్‌లను గోప్యంగా ఉంచుతున్న వైద్య బృందం

కలెక్టర్‌ వద్దకు నివేదికలు పంపుతున్నామని దాటవేసిన రిమ్స్‌ యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, కడప: విభజన చట్టంలోని అంశాల మేరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. ఆ మేరకు అధికార టీడీపీ మినహా తక్కిన రాజకీయపార్టీలన్నీ ప్రత్యక్ష ఉద్యమం చేపట్టాయి. కడప గడపలో స్వయంగా ముఖ్యమంత్రి 2015 ఆగస్టు 17న అఖిలపక్షాన్ని అవమానించారు. పైగా పోలీసులతో ఉద్యమంపై అణిచివేత ధోరణి ప్రదర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఉక్కు పరిశ్రమ నెలకొల్పే విషయమై మాట మాత్రం మాట్లాడలేదు. కాగా తాజాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ దీక్షకు దిగారు. ముందుగా రాజకీయ పార్టీల మద్దతు కోరారు. రాజకీయ పక్షాలు తిరస్కరించడంతో ప్రజామద్దతు దక్కలేదు. అధికారం ప్రయోగించి కలెక్టర్, జేసీ ద్వారా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించేలా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఇలా ఒక్కోక్క ప్రభుత్వ విభాగం ఒక్కోక్క రోజు దీక్షకు సంఘీభావం తెలిపేలా చర్యలు తీసుకున్నారు. ఆయా మంత్రులు సందర్శించిన రోజున ఆయా శాఖలకు చెందిన యంత్రాంగం దీక్షలకు వెళ్తోంది. అయితే బీటెక్‌ రవి దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు.

కడపకు క్యూకట్టిన మంత్రివర్గం
కడపలోని జెడ్పీ ఆవరణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆమరణ దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు రాష్ట్ర మంత్రివర్గం క్యూకట్టింది. దీక్ష ప్రారంభం నాటి నుంచి ప్రతిరోజు మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు దీక్షాశిబిరం సందర్శించేలా ప్రణాళిక రచించారు. ఆమేరకు సీఎంఓ ఆదేశిస్తే అధికారపక్షం ఆచరిస్తోందనే విషయం తెలిసిందే. 9 రోజులుగా 21మంది మంత్రులు, 14 మంది ఎంపీలు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రతిరోజు వీఐపీలను దీక్షకు పిలిపించడం, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ప్రముఖులు ప్రజానీ కాన్ని తరలించడం సర్వసాధారణమైంది. టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహుల మధ్య దీక్ష పోటీ పెంచుతోంది. కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాల్లో ఇలాంటి తంతు చోటుచేసుకుంది. ఆయా ప్రాంతాల నాయకులు ప్రతిరోజు వాహనాలను పెట్టి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రొటోకాల్‌ ఖర్చులు, జన సమీకరణ ఖర్చులు అంచనా వేస్తే ప్రతిరోజు దాదాపు రూ.1 కోటి ఖర్చవుతోన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా జిల్లాలో నాయకులు ఎవ్వరెవరు ఎంత మందిని తరలించినా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది మంత్రులు సంఘీభావం ప్రకటించి నా, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మా త్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ‘పోట్లదుర్తికి చెందిన రమేష్‌నాయుడు పంచాయతీకి ఎక్కువ–మండలానికి తక్కువ స్థాయి కల్గిన వ్యక్తిగా వరద ఇదివరకే ప్రకటించడం పాఠకులకు తెలిసిందే. ఆ మేరకు ఆయన కట్టుబడి ఉన్నారని పలువురు వివరిçస్తున్నారు.

గోప్యంగా బ్లడ్‌ రిపోర్టులు
‘రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆమరణదీక్ష ఓ బూటకం’ అనేందుకు అనేక కారణాలున్నాయి బలపడుతున్నాయి. జిల్లా పరిషత్‌ ఆవరణంలో చేపట్టిన దీక్షాస్థలి నుంచి సమావేశ మందిరం పక్కలో ఏర్పాటు చేసిన కలెక్టర్‌ విశ్రాంతి గదికి నిత్యం వెళ్తూ లోపల గంటల తరబడి మకాం వేసేవారు. కాలకృత్యాలను తీర్చుకునేందుకు వెళుతున్నారని మీడియా ప్రతినిధులు సైతం అభిప్రాయపడ్డారు. కాకపోతే ఆమరణదీక్ష ప్రారంభమయ్యాక ఐదురోజులు వరకూ అటు సీఎం రమేష్, ఇటు బీటెక్‌ రవి ఇద్దరు ఏమాత్రం నీరశించలేదు. చాలా హుషారుగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. సభ నిర్వహణ సైతం పర్యవేక్షిస్తున్నారు. స్వతహాగా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి షుగర్‌ పేషెంట్‌. ఆ విషయం తెలుగుతమ్ముళ్లే స్పష్టం చేస్తున్నారు. షుగర్‌ పేషెంట్‌గా ఉండీ ఆమరణదీక్ష చేపట్టారని కొనియాడారు కూడా. షుగర్‌ పేషెంట్‌ ఐదు రోజులుగా ఆహారం తీసుకోకపోతే కోమాలోకి వెళ్తారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ బ్లడ్‌ రిపోర్టులో 22వ తేదీ(మూడవ రోజు) 77కిలోలు బరువు ఉన్నట్లుగా నమోదైంది.

24వ తేదీ (5వ రోజు) కూడా 77కిలోలు బరువు ఉన్నట్లుగా నమోదైంది. అంటే ఏమి తినకుండా దీక్ష చేస్తున్న వ్యక్తి రెండురోజులకు ఒక్క గ్రాము కూడా తగ్గకుండా ఉన్నారు. దీనిని బట్టి రమేష్‌ దీక్షలో చిత్తశుద్ధి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 25, 26వ తేదీల వరకూ బ్లడ్‌ రిపోర్టు బహిర్గతం చేస్తూ వచ్చిన రిమ్స్‌ వైద్య బృందం తర్వాత గోప్యత పాటిస్తోంది. 25వ తేదీ బ్లడ్‌ షుగర్‌ 56ఎంజీ నమోదు కాగా, 28వ తేదీ 58ఎంజీ ఉన్నట్లుగా రిమ్స్‌ వైద్య బృందం అనధికారికంగా వెల్లడిస్తోంది. బ్లడ్‌ నివేదిక నేరుగా కలెక్టర్‌కు అందిస్తున్నామని, కలెక్టర్‌ గోప్యత పాటించాల్సిందిగా సూచించారని రిమ్స్‌ యంత్రాంగం చెప్పడం విశేషం. ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తోన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ 9 రోజులుగా ఆమరణదీక్ష చేస్తుంటే బ్లడ్‌ రిపోర్టుల పట్ల అత్యంత గోప్యత పాటిస్తున్నారు. బ్లడ్‌ రిపోర్టుల వల్ల అంతా ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉండడంతోనే రహస్యాన్ని పాటిస్తున్నారని పలువురు వెల్లడిస్తున్నారు.

నాలుగేళ్లుగా కడపకు రిక్తహస్తం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లుగా జిల్లాకు రిక్తహస్తమే చూపించాయి. వివిధ సందర్భాల్లో దాదా పు 22సార్లు సీఎంగా చంద్రబాబు పర్యటించారు. చెప్పిందే చెప్పడం, ఇచ్చిన హామీలే ఇవ్వడం మిన హా ప్రత్యేకించి ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని జిల్లావాసులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రప్రభుత్వంపై నెపం వేస్తూ ఉక్కు పరిశ్ర మ కోసం టీడీపీ దీక్షను రచించింది. పాత్రదారు డు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అయినప్పటికీ వ్యవహారాన్ని సీఎంఓ రక్తికట్టిస్తోంది. కాగా ఆమరణ దీక్షలో చిత్తశుద్ధి లోపం తెరపైకి రావడంతో టీడీపీ వ్యవహారం ‘బూడిదలో పోసిన పన్నీరు’లా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా రు. ఆ మేరకే ప్రజాదరణ కరువై ప్రభుత్వ యం త్రాంగం సాయంతో నెట్టుకురావాల్సి వస్తోందని వారు అభిప్రాయపడుతోండడం విశేషం.

‘కడప ఉక్కు’కు బీజేపీ అడ్డంకులు
కడప రూరల్‌: ‘కడప ఉక్కు’కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్రమంత్రి నారాయణ ఆరోపించారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలో ‘కడప ఉక్కు’ కోసం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ చేపట్టిన ఆమరణ దీక్ష గురువారం నాటికి 9వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీల అమలు బిల్లులో కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ప్రధానమైందని తెలిపారు.  ప్రధాని మోదీ హమీల అమలును ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు కడపకు వచ్చి, దీక్షా శిబిరాన్ని సందర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

దీక్షకు పెద్ద ఎత్తున డ్వాక్రా సభ్యుల తరలింపు
టీడీపీ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలను తరలించడం పరిపాటిగా మారింది. గురువారం దీక్షా శిబిరానికి స్థానిక ఆ పార్టీ నేతల సూచనలతో హరిత హోటల్‌ మీదుగా డ్వాక్రా సభ్యులను ర్యాలీగా తరలించారు.

మరిన్ని వార్తలు