మోదీ, కేసీఆర్‌ దొందూ దొందే.. 

22 Nov, 2018 02:25 IST|Sakshi
చిన్నారితో ముచ్చటిస్తున్న బృందాకారత్‌

తెలంగాణలో రాజకీయ అస్థిరత 

ఖమ్మం జిల్లా సభల్లో సీపీఎం నేత బృందాకారత్‌ 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్దన్న అయితే.. సీఎం కేసీఆర్‌ చిన్నన్నగా వ్యవహరిస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ మండిపడ్డారు. సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల పరిధిలోని కొణిజర్ల, ముదిగొండ మండల కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడంలో పోటీ పడుతున్నాయన్నారు. ఇదేమిటని ప్రశ్నించకపోతే, ఉద్యమ పంథాన పయనించకపోతే ఈ ప్రభుత్వాల దుందుడుకు చర్యలు నిలువరించలేమన్నారు.

తెలంగాణలో రాజకీయ సుస్థిరత కొరవడిందని, అధికారమే లక్ష్యంగా రాజకీయ నేతలు ఉద యం ఒక పార్టీలో.. సాయంత్రం మరో పార్టీలో దర్శనమిస్తున్నారన్నారు. వీరికి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రజాకూటమి కాదని.. మహా కుర్చీలాట కూటమి అని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వస్తే మాత్రం పాలనను టీఆర్‌ఎస్‌ తరహాలోనే కొనసాగిస్తారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేస్తూ.. మతం పేరుతో ప్రజలను విడదీస్తున్న మోదీ ప్రభుత్వానికి కేసీఆర్‌ మద్దతు పలుకుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో దేశవ్యాప్తంగా 50 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. తెలంగాణలో 4 వేలకు పైగా ఆత్మ హత్య చేసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలను ఓడించాలని పిలుపునిచ్చారు. సభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు భూక్యా వీరభద్రం, కోటా రాంబాబు, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి హైమావతి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు