‘వ్యవసాయానికి నోబెల్‌ ప్రైజ్‌ ఉందా?’

20 Dec, 2018 14:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గొప్పలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ​కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి నోబెల్‌ ప్రైజ్‌ ఉందా అని చంద్రబాబుని ప్రశ్నించారు. ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు గొప్పలు తారాస్థాయికి చేరాయని విమర్శించారు. పెథాయ్‌ తుపాన్‌ను ఓడించడం ఏంటి.. ప్రకృతిపై విజయం సాధించడం ఏంటని ఎద్దేవా చేశారు. ఆర్టీజీఎస్‌ వచ్చాకే తుపాన్‌ల గుర్తించారా.. ఇంతకాలం తుపాన్‌లను గుర్తించలేదా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సముద్రాన్ని కంట్రోల్‌ చేస్తున్నామని అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు బ్రెయిన్‌ వాష్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు మాజీ సీఎస్‌లు చంద్రబాబు అవినీతి గురించి రోజు మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు ప్రచారం తారాస్థాయికి చేరిందని తెలిపారు. చంద్రబాబు హయంలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఐదు, ఆరు కంపెనీలకే ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టర్లకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు సంస్థలతో ఏపీ ప్రభుత్వం కుమ్మకైందని వ్యాఖ్యానించారు. నిర్మాణ ఖర్చుల్లో తెలంగాణతో పోలిస్తే 5వేల కోట్ల రూపాయల తేడా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వేల కోట్ల అవినీతి జరిగితే కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాజధానిలో కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు