నేను ఫ్రంట్‌ పెడతాను.. పీఎం అవుతానంటే..

1 Jun, 2018 21:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మంతనాలు జరపడాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ‘రాహుల్‌తో కరచాలనం చేస్తే తప్పేంటి. తన భుజం తట్టాను. మీరు కలిసిన ఆ విధంగానే చేస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాలతో నాకు వ్యక్తిగత గొడవలు ఉన్నాయా’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నవ నిర్మాణ దీక్షపై శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

దేశంలో జరిగిన ఉప ఎన్నికలపై కూడా చంద్రబాబు జోస్యం చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాజా ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలన ఎలా ఉందో స్పష్టం చేస్తుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో ఎప్పుడు ఇంత ఘోరంగా ఓడిపోలేదని గుర్తు చేశారు. బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలువదదని బాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను కుప్పింగంతులు వేయ్యను.. ఎప్పుడు ఏం చేయ్యాలో నాకు తెలుసు. నేను ఫ్రంట్‌ పెడతాను. పీఎం అవుతానంటే మీరు రాస్తారు. కానీ ఫూల్‌ని, బఫూన్‌ను అవుతా.. అందరం కలసి పని చేయాలి’ అని అన్నారు.

అంతే కాకుండా రాష్ట్ర విభజన జరిగిన తీరుపై చం‍ద్రబాబు పాత పాటే పాడారు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ కంటే బీజీపీనే ఎక్కువ అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. రేపటి(జూన్‌ 2) నుంచి ఏడు రోజులపాటు నవనిర్మాణ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. రోజుకో అంశంపై మాట్లాడుతూ దీక్ష కొనసాగిస్తామన్నారు. 4 ఏళ్లలో జరిగిన అంశాలపై నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతానన్నారు. కేంద్రం సహకరించక పోయిన అభివృద్ధి అగదంటూ పేర్కొన్నారు. ఈ దీక్ష 5 కోట్ల మంది చేసే పవిత్ర కార్యక్రమం.. శనివారం ఉదయం 9 గంటలకు ఎవరు ఎక్కడున్నా అధికారులు ఈ దీక్షలో పాల్గొనాలని బాబు ఆదేశించారు. 

మరిన్ని వార్తలు