కాంగ్రెస్‌కి అసలా అవకాశమే ఇవ్వకూడదన్నది బీజేపీ పంతం

13 Nov, 2023 09:28 IST|Sakshi

సారి కూడా గెలిచి తీరాలన్నది కాంగ్రెస్‌ పంతం. 2018లో గెలిచింది కాంగ్రెస్‌ పార్టీనే. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది బీజేపీ వ్యూహం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీనే. 2018లో కాంగ్రెస్‌ గెలిస్తే, ఇప్పుడు ఆ పార్టీనే పవర్‌లో ఉండాలి కదా ? మరి కాంగ్రెస్‌ గెలవడం ఏంటి ? బీజేపీ పవర్‌లో ఉండటం ఏంటంటారా ? కాంగ్రెస్‌ గెలిచింది. ఆ తర్వాత అధికారాన్ని బీజేపీ హస్తగతం చేసుకుంది. సో...మళ్లీ పవర్‌లోకి వచ్చి పత లెక్కలు సరి చేయాలన్నది కాంగ్రెస్‌ పట్టుదల. కాంగ్రెస్‌కి అసలా అవకాశమే ఇవ్వకూడదన్నది బీజేపీ పంతం. అందుకే...మధ్యప్రదేశ్‌ ఎన్నికల సమరం...ఒక రేంజ్‌లో సెగలు పుట్టిస్తోంది. 
 

మొదట గెలిచింది కాంగ్రేస్సే..
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 230 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే, 15 నెలల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లో తిరుగుబాటు బావుటా ఎగురవేసి.... 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి సీఎంగా నాలుగోసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు...కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది.
 

శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పై ప్రజల్లో వ్యతిరేఖత...
మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదల మీదున్న బీజేపీకి మొదట ఆందోళన కలిగిస్తోంది శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వమే. 2005 నవంబర్‌ నుంచి 2018 డిసెంబర్‌ వరకు 13 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. ఆ తర్వాత తిరిగి 2020 నుంచి ఆయనే సీఎంగా ఉన్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందిం చిన భాజపా నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని ముందే గుర్తించిన భాజపా అధిష్ఠానం జాతీయ స్థాయి నాయకులు ఏడుగుర్ని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టింది. వారిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలు, ఒక జనరల్‌ సెక్రెటరీ ఉన్నారు. జన ఆశీర్వాద యాత్రల్లో హిందుత్వ వాదాన్ని బీజేపీ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా తాము హిందుత్వ వ్యతిరేకం కాదని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌నాథ్‌ తాను హనుమాన్‌ భక్తుడినని చెప్పే ప్రయత్నం ఇప్పటికే పదే పదే చేశారు. అలానే...


 ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి..
మధ్యప్రదేశ్‌ జనాభాలో ఓబీసీలు దాదాపు 50 శాతం వరకు ఉంటారు. శివరాజ్‌ సింగ్ చౌహాన్‌కు ముందు.. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా పని చేసిన ఉమాభారతి, బాబూలాల్‌ గౌర్‌లు ఓబీసీ నేతలే. తాజాగా కాంగ్రెస్‌ కులగణన చేపడతా మని హామీ ఇవ్వడంతో పాటు మహిళా రిజర్వేషన్‌లోనూ ఓబీసీ కోటాను తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో... ఓబీసీలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఎవరికి వాళ్లు ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తు న్నారు. అలానే...మధ్యప్రదేశ్‌ ఓటర్లలో దాదాపు 21శాతం మంది ఆదివాసీలు. మొత్తం 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 47 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ 16 స్థానాల్లో గెలిస్తే... కాంగ్రెస్‌ 31 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యా లను కాంగ్రెస్‌ హైలైట్‌ చేస్తోంది. మధ్యప్రదేశ్ జనాభాలో 17శాతం మంది ఎస్సీలు. వారికి 35 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. వీరి మద్దతు కూడగట్టేందుకు ఇరు పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 
 

దాడి,ప్రతి దాడి..
కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వం పై అవినీతి కోణంలో కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో దాడి చేసింది. మధ్య ప్రదేశ్‌లోనూ అదే వ్యూహానికి పదును పెడుతున్నారు. ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ కమల్‌నాథ్‌తో సహా పార్టీ నేతలంతా చౌహన్‌ ప్రభుత్వాన్ని 50 శాతం కమిషన్‌ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. అవినీతి కోణంలో కాంగ్రెస్‌ చేసే దాడిని తిప్పికొట్టడానికి బీజేపీ కొంత సతమతమౌతోన్నా...కాంగ్రెస్‌ అంటేనే అవినీతి అన్న తరహాలో బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. మధ్యప్రదేశ్‌ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. వారిని ఆకట్టుకు నేందుకు రెండు పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌, కర్నాటక తరహాలోనే హామీల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదంటోంది. 

కాంగ్రెస్‌ పార్టీ తమ సీఎం అభ్యర్థిగా కమల్‌నాథ్‌ని ప్రకటించేసింది. కానీ...బీజేపీ మాత్రం మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తుంది. అన్యాయంగా తమ నుంచి అధికారం లాక్కున్నారన్న సానుభూతి వర్కౌట్‌ అవుతుందన్న నమ్మకంతో కాంగ్రెస్‌ ఉంది. అయితే...కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేశామన్న భావన ప్రజల్లో ఉన్నా...అతి నెగిటివ్‌ వైబ్రేషన్స్‌ ఇవ్వకూడదన్న దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందన్న ఆశతో బీజేపీ. సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేయాలన్న కసితో కాంగ్రెస్‌. రాజస్థాన్‌ ఎన్నికల సమరంలో ఈ రెండు పార్టీలు ఇదే కోణంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ఇంతకీ ఆ సెంటిమెంట్‌ ఏంటంటే... రాజస్థాన్‌లో ఇప్పటి దాకా ఏ పార్టీకి వరసగా రెండు సార్లు అధికారం కట్టబెట్టలేదు ప్రజలు. సో...విజయం మాదే అని బీజేపీ ధీమాగా ఉంటే...ఈసారి సెంటిమెంట్‌ని పక్కని నెట్టి సరికొత్త రికార్డు సృష్టిస్తామంటోంది కాంగ్రెస్‌. ఈ విషయాన్ని పక్కన పెడితే...గ్రూప్‌ పాలిటిక్స్‌ నుంచి మొదలుపెడితే, నానా రకాల సమస్యలు ఇరు పార్టీలకు సవాల్‌ విసురు తున్నాయి.

నువ్వా,నేనా అన్నట్టుగా కాంగ్రెస్‌ బీజేపీ..
రాజస్థాన్‌ ఎన్నికల సమరంలో కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా, నేనా అన్నట్టుగా తలబడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతని గ్రహించిన కాంగ్రెస్‌ ఉచిత హామీలతో ఊదరగొట్టేస్తుంది. ఇటు బీజేపీ...గత ఎన్నికల్లో కోల్పోయిన ఓటు బ్యాంకుని తిరిగి పొందే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. మధ్యప్రదేశ్‌ తరహాలోనే రాజస్థాన్‌లోనూ బీజేపీ సీఎం విష యంలో ఒకే వ్యూహాన్ని అనుసరిస్తుంది.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై వ్యూహాత్మకంగానే ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. 2018 ఎన్నికల వరకు వసుంధర రాజే బీజేపీ పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ...ఈసారి పరిస్థితి పూర్తి మారిపోయింది. ఎమ్మెల్ఏ టిక్కెట్‌ కోసమే వసుంధర రాజె రెండో జాబితా వరకు ఆగాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్‌లో అశోక్‌ గెహ్లాట్‌ వర్సెస్‌ సచిన్‌ పైలట్‌ ఎపిసోడ్‌ ఇంకా జోరుగా సాగుతూనే ఉంది. దీంతో ఈ వార్‌ ఎపిసోడ్‌ పార్టీకి ఎంత నష్టం తెస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో పెరుగుతోంది.

అవినీతిపై పోరాటాలు..
రాజస్థాన్‌లో గత నాలుగేళ్లలో 18 సార్లు పరీక్ష పేపర్లు లీకయ్యాయి. ఈ వ్యవహారం ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అవినీతి పై సచిన్‌ పైలట్‌ నిరాహారదీక్ష చేయటం కూడా కాంగ్రెస్‌ని కొంత మేర ఇబ్బంది పెట్టొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సచిన్‌ పైలట్‌ నిరాహార దీక్షతో కొత్త చట్టం తీసుకురావాల్సి వచ్చింది. అవినీతిని అంతం చేయడానికి తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తుంది. సచిన్‌ పైలట్‌ పోరాటం చేసింది అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వ అవినీతిపైనే అని బీజేపీ ప్రచారం చేస్తోంది. అశోక్‌ గెహ్లాట్ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పార్టీ సచిన్‌ పైలట్‌ ఆయనకు కంట్లో నలుసుగా మారారు. 2020లో పైలట్‌ బహిరంగంగా గెహ్లాట్‌ పై తిరుగుబావుటా ఎగరేశారు. అధిష్టానం జోక్యంతో అప్పటికి తగ్గినా... అడుగడుగునా గెహ్లాట్‌కి చుక్కలు చూపిస్తూనే వచ్చారు సచిన్‌. ఒకరకంగా చెప్పాలంటే...అశోక్‌ గెహ్లాట్‌ పై అవినీతి కోణంలో బీజేపీ దాడి చేసేందుకు రోడ్‌ మ్యాప్‌ రెడీ చేసి పెట్టింది సచిన్‌ పైలట్టే. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నా...ఎలక్షన్‌ వార్‌ మొదలైయ్యే నాటికి వాటికి చెక్‌ పెట్టడంలో ఆ పార్టీ అధిష్టానం సక్సెస్‌ అయింది. 

ఉచిత హామీల జోరు..
2018 ఎన్నికల్లో రాజ్‌పుత్‌లు బీజేపీకి దూరం జరిగారు. అదే సమయంలో...రాజ్‌పుత్‌లతో పాటు గుర్జర్లు కూడా కాంగ్రెస్‌కి జై కొట్టారు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు కలిసివచ్చి అధికారం చేపట్టింది. ఈసారి రాజ్‌పూత్‌ల మద్దతు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు కాంగ్రెస్‌లో సచిన్‌ పైలట్‌కు జరిగిన అవమానంపై గుర్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న జైపుర్‌ రాజకుటుంబానికి చెందిన ఎంపీ దియాకుమారి... బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్నట్లు కాషాయ కండువాలు చెబుతున్నాయి. మేవార్‌, మార్వార్‌కు చెందిన రాజ్‌పూత్‌ నేతలను పార్టీలో చేర్చుకోవ టంలో ఆమె కీలకపాత్ర పోషించారు. దీంతో 2018లో పార్టీకి జరిగిన నష్టం.. కొంతమేర తగ్గుతుందని కమల నాథులు అంచనా వేస్తున్నారు. ఉచిత హామీలతో కాంగ్రెస్‌ హోరెత్తిస్తుంటే...బీజేపీ కూడా ఓటర్లను ఆకట్టుకునే దిశగా హామీల వర్షం కురిస్తోంది. 

సెంటిమెంట్‌ను నమ్ముకున్న బీజేపీ...
మరోవైపు రాజస్థాన్‌లో వరసగా జరుగుతోన్న ఈడీ దాడులు...ఎన్నికల ఫలితాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతా యన్న కోణం ఆసక్తిని రేపుతోంది. రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు ఓవింద్‌ సింగ్‌తో పాటు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతల ఇళ్లు, ఆఫీస్‌ల పై ఈడీ దాడులు జరిగాయి. అలానే సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ఈ సమన్లు అందాయి. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ తమపై ఈడీ దాడులు చేయిస్తోందని కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అశోక్‌ గెహ్లాట్ ప్రభుత్వం చేసిన అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి  ఈడీ దాడులు ఉదాహరణ మాత్రమే అంటోంది బీజేపీ. రాజస్థాన్‌లో ఒకే పార్టీని వరసగా రెండు సార్లు ఎప్పుడూ గెలిపించలేదు అక్కడి ఓటర్లు. ఆ సెంటిమెంట్‌ పరంగా చూసినా విజయం మాదే అంటోంది బీజేపీ. ఆ సెంటిమెంట్‌కి చెక్‌ పెట్టి, రెండోసారి విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్‌. 

మరిన్ని వార్తలు