మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని

16 Nov, 2018 10:10 IST|Sakshi
కృష్ణారావును వివరాలు అడిగి తెలుసుకుంటున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ అబ్బయ్య చౌదరి

 వైఎస్సార్‌సీపీ నేత కృష్ణారావుపై హత్యాయత్నం

 మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినందుకు కక్ష 

 గన్‌మన్‌లతో కలిసి బాధితుడిపై దాష్టీకం  

 పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా 

 ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ 

 హత్యాయత్నం కేసులో ఏ2గా చింతమనేని 

సాక్షి ప్రతినిధి, ఏలూరు, పెదవేగి రూరల్‌: అధికార టీడీపీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ సర్పంచ్‌ను అపహరించి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ సర్పంచ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగడంతో  చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

అసలేం జరిగింది..

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత మేడికొండ వెంకట సాంబశివ కృష్ణారావు గురువారం ఉదయం 11 గంటలకు ఏలూరు నుంచి స్వగ్రామం గార్లమడుగు వెళుతున్నాడు. మార్గంమధ్యలో పోలవరం కుడికాలువ గట్టుపై ఎమ్మెల్యే చింతమనేని వాహనాలు, ప్రొక్లెయిన్, టిప్పర్‌లు ఉండటాన్ని గమనించాడు. కాలువ గట్టుపై మట్టిని తవ్వి తరలిస్తున్నారని గుర్తించి, పోలవరం ఇరిగేషన్‌ ఎస్‌ఈకి ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. మట్టి తవ్వకాల వద్దకు ఇరిగేషన్‌ అధికారి చేరుకున్నారు. చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు గద్దే కిశోర్, ఏలియా, మరో పది మంది పైగా టీడీపీ నేతలు వచ్చి తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ అక్కడే ఉన్న కృష్ణారావుపై దాడి చేశారు. అతడిని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే చింతమనేనితోపాటు ఆయన గన్‌మెన్‌లు బూటుకాలుతో పొట్టలో, తలపై తన్నడంతో కృష్ణారావు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కృష్ణారావుపై కేసు బనాయించేందుకు పెదవేగి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా

మాజీ సర్పంచ్‌ కృష్ణారావుపై హత్యాయత్నం గురించి తెలుసుకున్న దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటరీ కో–ఆర్డినేటర్‌ కోటగిరి శ్రీధర్, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన పెదవేగి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేతలు, గన్‌మెన్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను రప్పించారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు పెదవేగి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని కొఠారు అబ్బయ్య చౌదరితో చర్చించారు. ఎమ్మెల్యే చింతమనేనితోపాటు టీడీపీ నేతలు, గన్‌మెన్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో నిందితులపై పెదవేగి ఎస్సై వి.కాంతిప్రియ సెక్షన్‌  341, 363, 323, 324, 379 రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యాయత్నం కేసులో ఏ2గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ1గా చింతమనేని ప్రధాన అనుచరుడు గద్దే కిశోర్, ఏ3గా ఎమ్మెల్యే గన్‌మెన్‌ల పేర్లను చేర్చారు. తీవ్రంగా గాయపడిన మేడికొండ కృష్ణారావు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. 

మరిన్ని వార్తలు