వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

10 Aug, 2019 12:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేతుల మీదుగా శనివారం ఉదయం నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ చేత రిబ్బన్‌ కట్‌ చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. కార్యాలయంలోని తన ఛాంబర్‌లోకి విచ్చేసిన ముఖ్యమంత్రికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరు అయ్యారు. అంతకు ముందు ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో  కార్యకర్తలు, అభిమానులు హాజరుకాగా, వారందరికీ  ముఖ్యమంత్రి అభివాదం తెలిపారు. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి బయల్దేరి వెళ్లారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు