ఇంత దారుణమైన వక్రీకరణా?

11 Dec, 2019 11:55 IST|Sakshi

టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్‌ మండిపాటు

సాక్షి, అమరావతి: ప్రతి విషయంలోనూ దారుణమైన వక్రీకరణకు టీడీపీ పాల్పడుతోందని, చరిత్రలో ఇంత దారుణంగా వక్రీకరణ చేసే వ్యక్తులు టీడీపీ నేతలు మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అడ్వజయిర్‌ పదవుల విషయమై టీడీపీ నేతల రాద్ధాంతంపై సీఎం జగన్‌ సభలో సమాధానం ఇచ్చారు. ‘ మా ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించే శాసనాన్ని తీసుకొచ్చాం. దేశ చరిత్రలోనే ఇలాంటి చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం మనదే. నామినేటెడ్‌ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. ఒకప్పుడు మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్‌ పదవులు రాజకీయ పలుకుబడి ఉన్న ఓసీ వర్గానికి మాత్రమే వచ్చేవి. కానీ ఈ చట్టాల వల్ల కృష్ణాజిల్లాలో 19 మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ పదవులు ఉంటే అందులో పది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయి. ఆలయ కమిటీ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. జిల్లా సహకరా బ్యాంకులు, మార్కెటింగ్‌ సొసైటీల్లోనూ 50 రిజర్వేషన్‌ కల్పించాం. ఈ రిజర్వేషన్‌లోనూ 50శాతం పదవులు మహిళలకు ఇచ్చాం’ అని సీఎం జగన్‌ గుర్తుచేశారు.

ఈ సందర్భంగా తమ ప్రభుత్వ హయాంలో వివిధ పదవులకు జరిగిన నియామకాల జాబితాను సీఎం జగన్‌ సభలో చదివి వినిపించారు. ఆ జాబితా..

 • జస్టిస్‌ ఏ శంకర్‌నారాయణ: చైర్మన్‌, ఏపీ శాశ్వత బీసీ కమిషన్‌
 • జక్కంపూడి రాజా : చైర్మన్‌, కాపు కార్పొరేషన్‌
 • శ్రీమతి ఆర్కే రోజా : చైర్‌పర్సన్‌, ఏపీఐఐసీ  
 • ప్రముఖ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి: చైర్మన్‌, ఏపీ స్టేట్‌ మెడ్‌ అండ్‌ ఇన్ఫస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌
 • శ్రీమతి లక్ష్మీపార్వతి : చైర్‌పర్సన్‌, ఏపీ తెలుగు అకాడమీ
 • (ఈ సం‍దర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాపకులుఎన్టీఆర్‌ భార్య, చంద్రబాబుగారి అత్తగారే. మీ అత్తగారే.. మీరు ఇవ్వలేదు. మేం ఇచ్చామని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు)
 • రామ్మోహన్‌రావు, లక్ష్మమ్మ : వైస్‌ చైర్‌పర్సన్లు, ఏపీ తెలుగు అకాడమీ
 • బీ సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ : ఏపీసీఐ చీఫ్‌ సెక్రటరీ
 • జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌ : చైర్మన్‌, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మనిటరింగ్‌ కమిషన్‌
 • భార్గవరాం : వైస్‌ చైర్మన్‌, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మనిటరింగ్‌ కమిషన్‌
 • రామ్మోహన్‌రావు : చైర్మన్‌, ఏపీ కనీస వేతన సంఘం
 • ఎండీ నౌమన్‌ : చైర్మన్‌, ఏపీ ఉర్దు అకాడమీ
 • అబ్దుల్‌ రహీం అఫ్సర్‌ : వైస్‌ చైర్మన్‌, ఏపీ ఉర్దు అకాడమీ
 • జియావుద్దీన్‌ : చైర్మన్‌, ఏపీ మైనారిటీ కమిషన్‌
 • బండి అర్జున మనోజ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌, ఏపీ మైనారిటీ కమిసన్‌
 • రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జేసీ శర్మ: చైర్మన్‌, వన్‌ మ్యాన్‌ కమిషన్‌ (బేడ, బుడగ జగం వర్గాల సమస్యల పరిష్కారం కోసం)
 • మధుసూదనరావు, చైర్మన్‌, రెల్లి కార్పరేషన్‌
 • శ్రీమతి అమ్మాజీ, చైర్మన్‌, ఏపీ మాల కార్పొరేషన్‌
 • కొమ్మూరి కనకరావు, ఏపీ మాదిగ కార్పొరేషన్‌
 • వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్‌

ఫైనల్‌ లిస్ట్‌ అసెంబ్లీలో విడుదల చేస్తాం
ఇందులో సగానికిపైగా పదవుల్లో చైర్మన్లు, చైర్‌పర్సన్లు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారని, అయినా ఇది టీడీపీ వాళ్లకు కనిపించడం లేదని సీఎం జగన్‌ అన్నారు. ఇంకా 150కుపైగా చైర్మన్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, లోకల్‌ బాడీ ఎన్నికల తర్వాత వాటిని నియమిస్తామని తెలిపారు. ఈ నియమకాలు ముగిసిన తర్వాత తుది జాబితాను అసెంబ్లీలో విడుదల చేస్తామని, ఈ జాబితాలో కచ్చితంగా 50శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటటీలకు కేటాయిస్తామన్నారు.

ఇక, అడ్వయిజర్లు నామినేటెడ్‌ పోస్టులు కావని, కేవలం ఒకటి, రెండేళ్లు మాత్రమే కొనసాగుతాయని అన్నారు. ఆయా రంగాల్లో నైపుణ్యం గల వారిని.. ఆయా రంగాల విలువను పెంచేందుకు అడ్వయిజర్లుగా తీసుకున్నామని సీఎం జగన్‌ వివరించారు. మీ హయాంలో మీ సామాజికవర్గానికి చెందిన కుటుంబారావును అడ్వయిజర్‌గా తీసుకున్నారని, కానీ దీనిని తాము ప్రశ్నించడం లేదని,
కానీ, ఆ ప్రశ్నను ప్రశ్నించడం లేదని, అడ్వజయిర్ల పోస్టుల్లో కులం ప్రస్తావన తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఎస్సీ దళిత మహిళ ఉండటం, ఒక విద్యామంత్రిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సురేశ్‌ ఉండటం, రెవెన్యూ మంత్రిగా బీసీ వర్గానికి చెందిన సుభాష్‌ చంద్రబోస్‌ ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. అయినా ప్రతి విషయంలో రాజకీయాలు, వక్రీకరణకు పాల్పడే టీడీపీ సభ్యులకు మైక్‌ ఇవ్వడం పాపం లాంటిదన్నారు.

టీడీపీకి అది వెన్నతో పెట్టిన విద్య: కన్నబాబు
ప్రతి విషయాన్ని వక్రీకరించడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 24 డిపార్ట్‌మెంట్లలో 264మందిని కన్సల్టెంట్‌ పోస్టుల్లో టీడీపీ నియమించిందని,  బంధుప్రీతితో తమకు కావాల్సిన వాళ్లను, అనుయాయిలను మాత్రమే కన్సలెంట్లగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. అడ్వయిజర్ల విషయంలో టీడీపీ కులాలు, మతాలు ప్రస్తావన తెచ్చి రాద్ధాంతం చేస్తుందన్నారు. సలహాదారులను కూలాన్ని, మతాన్ని చూసి నియమించుకోరని, ఆయా రంగాల్లో నిపుణులు, సమర్థులను మాత్రమే అడ్వయిజర్లుగా నియమించుకుంటారని ఆయన స్పష్టం చేశారు. అవి శాశ్వతమైన పోస్టులు కావని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని మొట్టమొదటిసారిగా మహిళకు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది అని, టెంపుల్‌ కమిటీ మొదలుకొని మార్కెట్‌ కమిటీల వరకు ప్రతిచోటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించామని తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించామని వివరించారు. ప్రభుత్వం నియమించుకున్న 75మంది అడ్వయిజర్లలో అన్ని వర్గాలవారు ఉన్నారని తెలిపారు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు కూడా అడ్వయిజర్లుగా ఉన్నారని వివరించారు.

మరిన్ని వార్తలు