డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు 28న ఎన్నికలు

21 Feb, 2020 02:06 IST|Sakshi

నోటిఫికేషన్‌ జారీచేసిన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ

సాక్షి, హైదరాబాద్‌ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 28న జరుగనున్నాయి. అందుకు సంబంధించి రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రతీ జిల్లాకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం గమనార్హం.  ఈ నెల 22న జిల్లా అధికారులు కూడా మళ్లీ నోటిఫికేషన్లు జారీచేస్తారని అథారిటీ అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.

అనంతరం ఈ నెల 28న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. 29న ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక జరుగుతుంది. అదే రోజు చైర్మన్, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారని ఎన్నికల అథారిటీ తెలిపింది. ప్రతీ డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో 20 మంది వంతున డైరెక్టర్లను ఆ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. 20 మంది డైరెక్టర్లలో 16 మందిని ప్యాక్స్‌ల నుంచి, మరో నలుగురిని చేనేత సంఘాలు  వివిధ సొసైటీలకు చెందిన వారి నుంచి ఎన్నుకుంటారు. 16 మంది డైరెక్టర్లలో ఎస్సీ లకు మూడు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు రెండు, ఓపెన్‌ కేటగిరీకి 10 వంతున రిజర్వు చేశారు. మరో 4 డైరెక్టర్లకు సంబంధించిన వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓపెన్‌ కేటగిరీలకు ఒక్కోటి వంతున రిజర్వేషన్‌ కల్పించారు. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు.

మరిన్ని వార్తలు