సీపీఐ కార్యదర్శి రామకృష్ణకు ఝలక్‌

14 Jan, 2020 08:55 IST|Sakshi

చంద్రబాబుతో అంటకాగడంపై సహ కార్యదర్శి జేవీవీ అసంతృప్తి

సమగ్రాభివృద్ధికి కట్టుబడాలని కర్నూలు జిల్లా కార్యవర్గం తీర్మానం 

కర్నూలు(సెంట్రల్‌): అమరావతి విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఏకపక్ష నిర్ణయాలపై ఆ పార్టీలో నిరసన స్వరాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుతో కలిసి బస్సు యాత్రలో పాల్గొనడంపై పార్టీ కేడర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర కార్యవర్గంలో చర్చించకుండా అమరావతి రాజధానిగా ఉండాలని ప్రకటించడాన్ని సీపీఐ సహ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ ఇప్పటికే తప్పుపట్టారు. ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన చంద్రబాబుతో రామకృష్ణ అంటకాగడంపై విమర్శలు చేశారు.

సోమవారం పత్తికొండలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలోనూ రామకృష్ణ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి పార్టీ కట్టుబడాలని తీర్మానం చేశారు. అమరావతి రాజధానిగా ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఎవరిని అడిగి బాబు చుట్టూ తిరుగుతున్నారని పలువురు నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం. అన్ని జిల్లాల అభివృద్ధే పార్టీ విధానమని, దానికి కట్టుబడి ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు.  

మరిన్ని వార్తలు