ఆ సత్తా చంద్రబాబుకు ఉందా? 

9 Jan, 2020 08:50 IST|Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : రాష్ర్టరాజధాని మార్పు విషయంలో ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఒక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే కడుపుమంటతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవీ.రమణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ఉండాలని అడిగే హక్కు చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా రాజధాని పేరుతో పదుల సంఖ్యలో నమూనాలను జనాలకు చూపుతూ మోసం చేస్తూ వచ్చారన్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్క నమూనా కూడా ఆమోదం కాలేదన్నారు. ఇప్పుడు కూడా కూలి మనుషులను పెట్టుకొని అమరావతి పరిరక్షణ అంటూ ఉద్యమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్లనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చెబుతున్నట్లు అసలు మూడుచోట్ల రాజధానులు అన్న అంశమే తప్పు అన్నారు.

రాష్ట్రంలో ఒక్కచోటే రాజధాని ఉంటుందని, అది కూడా వైజాగ్‌లోనే ఉంటుందన్నారు. ఇప్పుడున్న రాజధాని వైజాగ్‌కు మారుతుందే తప్ప మరొకటి కాదన్నారు. మూడు రాజధానులంటూ గగ్గోలు పెడుతూ జనాలను చంద్రబాబు గందరగోళంలో పడేస్తున్నారని తెలిపారు. సచివాలయం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అవుతుందని, అసెంబ్లీ సమావేశాలు మాత్రం అమరావతిలోనే జరపాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీర్మానించారన్నారు. రాజధాని మార్పు వల్ల అటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, హైకోర్టు ఏర్పాటు పట్ల రాయలసీమ జిల్లాల వారు కూడా ఆనందంగా ఉన్నారన్నారు.

చంద్రబాబుకు ధైర్యముంటే అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పర్యటించడం మానేసి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని ప్రజలతో అమరావతి రాజధానిగా ఉండాలని ఒప్పించగలరా, ఆ సత్తా, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐదేళ్లు పరిపాలన చేసి కనీసం సొంత ఇల్లు కూడా ఎందుకు కట్టుకోలేకపోయాడో చంద్రబాబు చెప్పాలని కోరారు. బీజేపీ నేతలు ఒక్కోమారు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ కావాలని, అభివృద్ధి కావాలని చెప్పి ఇప్పుడు ఒక్కో నాయకుడు ఒక్కో రాగం తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం మరింత ముందుకెళుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు