తొలి నియోజకవర్గం తొలి గ్రామం తొలి ఓటరు

2 Nov, 2018 03:07 IST|Sakshi

కాగజ్‌నగర్‌(సిర్పూర్‌) :  సిర్పూర్‌.. మారుమూల నియోజకవర్గం. కానీ, ఓటరు జాబితా, ఎన్నికల ప్రక్రియలో మాత్రం ఈ నియోజకవర్గం ముందు వరుసలో నిలుస్తోంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా.. ప్రతి సెగ్మెంట్‌కు ఒక వరుస సంఖ్య ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సిర్పూర్‌ నియోజకవర్గం వరుస సంఖ్య 246.

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇది తెలంగాణలోని నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక, ఈ నియోజకవర్గంలోని మాలిని గ్రామంలో తొలి పోలింగ్‌ స్టేషన్‌ ఉంది. ఇదే గ్రామానికి చెందిన కినాక సుమనబాయి.. తెలంగాణ రాష్ట్ర ఓటరు జాబితాలో తొలి ఓటరుగా గుర్తింపు పొందారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన సుందరబాయి రాష్ట్రంలో తొలి ఓటరుగా ఉండేవారు. ఆమె మరణానంతరం సుమనబాయి తొలి ఓటరయ్యారు.

ఎన్నికల లెక్కల్లో ముందు వరుసలో ఉన్న మాలిని గ్రామం.. అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలోనే ఉండిపోయింది. ఈ గ్రామ జనాభా 600. ఓటర్లు 460 మంది. మండల కేంద్రం కాగజ్‌నగర్‌కు ఈ గ్రామం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘ప్రతి ఎన్నికల్లోనూ నిస్వార్థంగా ఓటు వినియోగించుకుంటున్నా. ఎన్ని పనులున్నా పక్కనపెట్టి ఆ రోజు తప్పకుండా ఓటు వేస్తుంటాను’  అని తొలి ఓటరు సుమనబాయి అంటున్నారు.

మరిన్ని వార్తలు