‘జగన్‌పై హత్యాయత్నం కుట్రలో బాబూ.. లోకేష్‌ ఉన్నారేమో’

30 Oct, 2018 17:14 IST|Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రమేయం లేదనుకుంటే  సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరిస్తారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. కేసును నీరుగార్చేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. 

నటుడు శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ పై టీడీపీ సర్కార్ ఎందుకు విచారణకు అంగీకరించడం లేదని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం అంపశయ్య పై ఉందని, చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్నిఅస్థిరపరచాల్సిన అగత్యం తమకు లేదన్నారు. రాజకీయంగా వైఎస్‌ జగన్ బలపడడంతో నేరుగా ఎదుర్కొనలేకనే ఆయనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు.

వారికి ముందే తెలుసు..
సాక్షి, నెల్లూరు : వైఎస్‌ జగన్‌పై హత్యాయంత్నం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్‌పై దాడి జరుగనుందని ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతల డ్రామాలన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

సాక్షి, ఒంగోలు : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి అనంతరం పరామర్శించాల్సిన చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడని వైస్సార్ కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర   అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి అనంతరం నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచి ఏకంగా ధర్నా చేశారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు