రక్తికట్టని హీరో ఉపేంద్ర రాజకీయ అరంగేట్రం

19 Apr, 2018 12:22 IST|Sakshi
హీరో ఉపేంద్ర

కేపీజేపీ పార్టీ పెట్టి.. అంతలోనే రాజీనామా

ఈ ఎన్నికల్లో పోటీ లేనట్టే

సాక్షి, బెంగళూరు : ఉపేంద్ర అనగానే వెండితెరపై మనిషి మనస్తత్వాన్ని వివిధ కోణాల్లో విప్పిచెప్పే వినూత్న నటుడు గుర్తుకొస్తాడు. కన్నడనాట తనదైన సినిమాల ద్వారా రియల్‌ స్టార్‌గా పేరు పొందాడు. నిజజీవితంలోనూ హీరో అనిపించుకోవాలని ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడితే అది కాస్తా ఫ్లాప్‌ షో అయ్యిందని విమర్శలు మూటగట్టుకున్నాడు. అభిమానులు ఉప్పి అని ప్రేమగా పిలుచుకునే ఉపేంద్ర.. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష (కేపీజేపీ) పార్టీని గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించి అంతేవేగంగా పార్టీ నుంచి బయటకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజలకు సుపరిపాలన అందజేయాలనేదే తన పార్టీ లక్ష్యమని, ఈ 224 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని అప్పట్లో ధీమాగా ప్రకటించారు.

అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడతో కుమ్ములాటలు మొదలయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల పంపకంలో వీరి మధ్య వివాదం రాజుకుంది. పార్టీలో టికెట్లను కొంతమంది అమ్ముకుంటున్నారని ఉపేంద్ర ఆరోపించారు. ఉపేంద్ర నియంత మాదిరి వ్యవహరిస్తున్నారని, తనకు నచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని మరో వర్గం నాయకులు ఆరోపించారు. ఈ విధంగా ఒకరినొకరు ఆరోపణల నేపథ్యంలో మార్చి 6న ఉపేంద్ర పార్టీకి రాజీనామా చేశాడు. విలువలు లేని చోట తానుండలేనని, త్వరలోనే కొత్త పార్టీ స్థాపిస్తానని ప్రకటించాడు. 

ప్రజాకీయ పార్టీకి పేరు నమోదు 
ఇటీవలే ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిసిన ఉపేంద్ర ప్రజాకీయ పేరుతో కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్‌ చేశాడు. ఏప్రిల్‌ నెలాఖరుకు రిజిస్ట్రేషన్‌ పూర్తి అయి తమ పార్టీ అందుబాటులోకి వస్తుందని ఆయన చెబుతున్నాడు. తమ పార్టీకి గుర్తింపు లభిస్తే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నాడు. అయితే ఈ విధానసభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని, ఎవరికీ ప్రచారం చేయబోనని ప్రకటించాడు. తమ అభిమాన నాయకుడు పోటీ చేస్తారని వేయికళ్లతో వేచిచూసిన అభిమానులకు నిరాశే ఎదురయింది. ఉప్పి తమ పార్టీలో చేరితే స్వాగతిస్తామని అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించాయి. 

సినిమాల్లో బిజీబిజీగా..
తరువాత ఉపేంద్ర మళ్లీ సినిమాల్లో తలమునకలయ్యాడు. వచ్చే వారం తన కొత్త సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన నటించిన ‘హోం మినిస్టర్‌’ చిత్రం చివరి దశలో ఉంది. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలని, డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలని ఉపేంద్ర ఇటీవల వ్యాఖ్యానించాడు. రియల్‌ స్టార్‌ పార్టీ ఇలా మంచి వినోదాన్నే పంచింది.  

Election 2024

మరిన్ని వార్తలు