ఆవు మాంసం వడ్డించారంటూ దాడి.. | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 12:46 PM

Man assaulted In Jharkhand For Serving Banned Meat - Sakshi

కోడెర్మా, జార్ఖండ్‌: పెళ్లి విందులో ఆవు మాంసాన్ని (బీఫ్‌) వడ్డించారంటూ ముస్లిం వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన కోడెర్మా జిల్లా దోమ్‌చాంచ్‌ తాలుకా, నవాడీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి  జుమాన్‌ మియాన్‌ తన కొడుకు నిఖా సందర్భంగా బంధువులకు, స్నేహితులకు విందు ఇచ్చాడు.

అయితే అతని ఇంటి వెనకాల ఆవు కాళ్లు, కొన్ని ఎముకలు దొరకడంతో, పెళ్లి వేడుకలో ఆవు మాంసం వడ్డించారని గ్రామస్తులు భావించారు. మూకుమ్మడిగా అతని ఇంటిపై దాడి చేసి జుమాన్‌ను తీవ్రంగా కొట్టారని పోలీసులు వెల్లడించారు. జుమాన్‌పై దాడితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ల ముందు గల వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం మత ఘర్షణలు తెలెత్తకుండా భారీ స్థాయిలో జిల్లా వ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించింది.

శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నామని కోడెర్మా ఎస్పీ శివాణి తివారి తెలిపారు. గ్రామంలో 144 సెక్షన్‌ విధించామన్నారు.‘ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశాం. పరిస్థితి అదుపులోనే ఉంద’ని ఆమె చెప్పారు. సోషల్‌ మీడియాలో ఈ ఘటన వైరల్‌ కాకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆవు మాంసం వడ్డించిన మాట నిజమేనా..? అని విలేకరులు ప్రశ్నించగా.. గ్రామస్తుల ఆరోపణలకు కారణమైన ఆవు కాళ్లు, ఎముకలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించాం, రిపోర్టు వచ్చాక తదుపరి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

కాగా, ఇదే తరహా ఘటన జార్ఖండ్‌లో గతేడాది చోటుచేసుకుంది. రాంఘర్‌ పట్టణంలో గత జూన్‌ 29 న కారులో ఆవు మాంసాన్ని తరలిస్తున్నాడనే నెపంతో మటన్‌ వ్యాపారి అలీముద్దీన్‌ అన్సారీపై కొందరు దాడి చేశారు. అయితే పట్టుబడిన మాంసాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షలకై పంపగా.. రిపోర్టుల్లో అన్సారీ దగ్గర దొరికింది ఆవు మాంసమే అని తేలింది. దాంతో గోవధ శాలలు నిర్వహిస్తున్న11 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారందరికీ జీవితఖైదు విధిస్తూ రాంఘర్‌ కోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement