సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ

22 Mar, 2018 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్‌ ప్రసంగం తాలూకు మొత్తం ఒరిజినల్‌ వీడియో ఫుటేజీని 22న సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని గతంలో అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. దీనిపై గురువారం విచారణ జరుగగా, వీడియోలు ఇంకా సిద్ధం కాలేదని, మరికొంత సమయం కావాలని  ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టును కోరారు. ఈ నెల 27వ తేదీన ఈ కేసుకు సంబంధించిన సీడీలను సమర్పించి కౌంటర్‌ దాఖలు చేస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్‌ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లుగా పేర్కొంటూ రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు