ఆ నాలుగూ అలా కొట్టేశారా ?

12 Jun, 2019 07:15 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రమంతటా కనీవినీ ఎరుగని రీతిలో వీచిన ఫ్యాన్‌ గాలికి బలమైన టీడీపీ కోటలన్నీ తుత్తునీయలయ్యాయి. విశాఖ జిల్లాలోనూ అదే ఉద్ధృతి.. మొత్తం గ్రామీణ జిల్లాతోపాటు విశాఖ శివారులోని మూడు నియోజకవర్గాల్లోనూ చతికిలపడిపోయిన అధికార టీడీపీ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఎలా నెగ్గుకురాగలిగిందన్న ఆశ్చర్యం, అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి.

మంత్రి హోదాలో ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం 1800 ఓట్లతో బయటపడటం, దక్షిణంలోనూ 3893 ఓట్ల తేడాతో  వాసుపల్లి గణేష్‌కుమార్‌ గట్టెక్కగా మిగిలిన పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నెగ్గుకురావడానికి కారణాలేమిటి?.. తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పటికీ సాగుతోంది.దీని వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న వాదనలు తాజాగా బయటకొస్తున్నాయి. ఇందులో జీవీఎంసీ అధికారుల పాత్రపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రధానంగా ఒకే ఒక్కడిపై ఇవన్నీ కేంద్రీకృతమవుతున్నాయి. జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు అధికారులు ఇళ్ల లబ్ధిదారులను దాదాపు బ్లాక్‌మెయిల్‌ చేసి టీడీపీకి ఓట్లు వేయించారని.. ఈ తతంగాన్ని సదరు ప్రాజెక్టు ముఖ్య అధికారి అంతా తానై నడిపించారని అంటున్నారు.ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని తలా రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టిన నగరంలోని సుమారు 40వేల కుటుంబాలను.. టీడీపీని గెలిపిస్తేనే ఇళ్లు వస్తాయని, లేదంటే మీరు కట్టిన డబ్బులు కూడా పోతాయని యూసీడీ అధికారులే బెదిరించి వారి చేత బలవంతంగా టీడీపీకి ఓట్లు వేయించినట్లు తెలుస్తోంది. ఇదే నగరంలో ఆ నలుగురు టీడీపీ అభ్యర్థులను ఓటమి నుంచి బయటపడేసిందంటున్నారు.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నగరంలో టీడీపీకి మద్దతుగా జీవిఎంసీ యూసీడీ(అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌) ప్రాజెక్ట్‌ ముఖ్య అధికారి ఆధ్వర్యంలో పెద్ద తతంగమే నడిచిందని యూసీడీ వర్గాలే చెప్పుకొస్తున్నాయి. సదరు అధికారి  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌లకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు సెలవులో వెళ్లిన ఆ అధికారి  నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే ఆగమేఘాలపై రంగంలోకి దిగాడు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరితో మాట్లాడాడు. మీకు ఇళ్లు రావాలంటే టీడీపీకి ఓటు వేయాల్సిందేనని నిస్సిగ్గుగా ప్రచారం చేశాడు. ఒక విధంగా బెదిరింపులకు పాల్పడ్డాడు.

మొదటి నుంచి అతగాడిది ‘పచ్చ’పాతమే
టీడీపీ మాదే.. అని భావించే  సామాజికవర్గానికి చెందిన ఆ అధికారి సోషల్‌ వెల్ఫేర్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. 2016 నుంచి ప్రాజెక్టు డైరెక్టర్‌(పీడీ)గా పనిచేశారు. 2018లో బదిలీ అయినా ఇక్కడే కొనసాగుతూ వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపుల రుణాలు, పింఛన్లు, ఇళ్ల మంజూరుతో పాటు కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంటారు. ఏడాది క్రితం ఈయన ఆధ్వర్యంలోనే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది.

ఇదే అదునుగా ఎన్నికల ముందు నుంచి అప్పటి నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, గంటా శ్రీనివాసరావు, గణబాబులతో అతి సన్నితంగా ఉండేవారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత వ్యూహం ప్రకారం  నగరంలోని సుమారు 40 వేల మంది ఇళ్ల దరఖాస్తుదారుల చేత రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టించేసుకున్నారు. ఆనక టీడీపీకి ఓటు వేస్తేనే ఇళ్లు ఇస్తామని.. లేదంటే మీ డీడీలు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగారు.  

తనకు తోడుగా మరో అధికారిని కూడా తెచ్చుకున్నారు. గతంలో జోన్‌–3 ,5లలో జోనల్‌ కమీషనర్‌గా పనిచేసిన ఆ అధికారి.. ఎన్నికలకు కొంతకాలం ముందు తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా నియమితలయ్యారు. అయితే యూసీడీ ముఖ్య అధికారి ఇక్కడ లేని పోస్టు సృష్టించి.. ఆ అధికారిని డిప్యుటేషన్‌ మీద ఇక్కడికి తీసుకొచ్చి హౌసింగ్‌ స్ఫెషల్‌ అధికారిగా నియమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టల్లా అడుతూ దరఖాస్తుదారులను తీవ్రంగా ప్రభావితం చేసి ఓట్లు దండుకున్నారు.

ఫలితాల అనంతరం బదిలీ
తీరా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడంతో వారిలో భయం ఆవహించింది. నగరంలో తాము అనుకున్నది సాధించగలిగినా అధికారం టీడీపీ చేజారడంతో ఇక్కడే ఉంటే తమ బండారం బయట పడుతుందనే భయంతో సదరు యూసీడీ ముఖ్య అధికారి పలాయనం చిత్తగించారు. ఉన్న పళంగా బదిలీ చేయించుకుని మే 31న సాంఘిక సంక్షేమ శాఖకు వెళ్లిపోయారు. ఇదంతా జీవీఎంసీ ఉన్నతాధికారుల కనుసన్నుల్లోనే జరిగిందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు