తప్పు చేశాను.. అందుకే క్షమాపణ!

4 May, 2019 11:22 IST|Sakshi

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి తాను చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ నినాదానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ‘చౌకీదార్ చోర్ హై’ నినాదాన్ని సుప్రీంకోర్టుకు ఆపాదించి తప్పు చేశానని, అందుకే క్షమాపణ చెప్పానని ఆయన అన్నారు. అయితే, తాను క్షమాపణ చెప్పింది సుప్రీంకోర్టుకు కానీ, మోదీకి కాదన్నరు. రఫేల్ డీల్లో మోదీ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాహుల్ గాంధీ శనివారం మీడియాతో మాట్లాడారు.

జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పాకిస్థాన్ పంపించిందే బీజేపీ ప్రభుత్వమని.. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించిన అంశంపై స్పందిస్తూ పేర్కొన్నారు. మా ప్రధాన ధ్యేయం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓడించడమేనని పేర్కొన్నారు. ఉద్యోగాలు, వ్యవసాయం రంగం ఎదుర్కొంటున్న కష్టాలు వంటి దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ప్రస్తావిస్తూ.. ప్రభావవంతమైన మ్యానిఫెస్టోను తమ పార్టీ రూపొందించిందన్నారు. సాయుధ బలగాలను బీజేపీ అవమానిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్మీ బీజేపీ నేతల సొత్తు కాదని, దాడులు చేసింది ఆర్మీ కానీ, ప్రధాని కాదన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు.

మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, న్యాయ్ పథకం ద్వారా మళ్లీ ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేస్తామని అన్నారు. తమ అంచనా ప్రకారం ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు.

>
మరిన్ని వార్తలు