నేనెప్పుడూ ప్యాకేజీకి అంగీకరించలేదు

22 Jul, 2018 04:06 IST|Sakshi

నేను కాదు.. ప్రధానే యూటర్న్‌ తీసుకున్నారు

నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తామన్నారు

ఆయన హామీలు నెరవేర్చలేదు

నేను మోదీ కంటే ముందే ముఖ్యమంత్రినయ్యా

నాకు పరిణతి లేదంటారా?

ఈ దేశంలో నేను సీనియర్‌ రాజకీయవేత్తను

ఢిల్లీ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు బదులుగా తానెప్పుడూ స్పెషల్‌ ప్యాకేజీని అంగీకరించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తాను ప్యాకేజీకి అంగీకరించినట్లు శుక్రవారం లోక్‌సభలో ప్రధాని మోదీ చెప్పారని.. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలను పన్ను రాయితీలతో సహా కల్పిస్తామని ఆయనే హామీ ఇచ్చారని తెలిపారు. లోక్‌సభలో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సంఖ్యా బలానికి, నైతికతకు మధ్య జరిగిన పోరాటంగా చూడాలని చెప్పారు. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హామీలు ఇచ్చారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ అనేక హామీలు ఇచ్చారు. ప్రధాని అయ్యాక కూడా హామీలు ఇచ్చారు. కానీ,  ప్రత్యేక హోదా ఇవ్వనందునే మేం ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. 29 సార్లు ఢిల్లీకి వచ్చి అడిగినా పరిష్కరించలేదు. విభజన వల్ల మేం చాలా నష్టపోయాం. మాకు న్యాయం చేసే బాధ్యత కేంద్రానికి లేదా? తల్లిని చంపి బిడ్డను బతికించారని నిన్న కూడా ప్రధాని అన్నారు. మరి ఆ తల్లి కోసం ఏదైనా చేయాలి కదా? కాంగ్రెస్‌ను మీరు బ్లేమ్‌ చేస్తున్నారు సరే.. మీ బాధ్యతను ఎందుకు మరిచిపోయారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఆర్థిక సంఘాన్ని సాకుగా..
‘పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సులవల్ల ఇవ్వలేకపోతున్నామని ప్రధాని చెబుతున్నారు. అది ఎక్కడ చెప్పిందని నేను ప్రధానిని అడుగుతున్నాను. తామెక్కడా దానిని ప్రస్తావించలేదని ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం కార్యనిర్వాహక నిర్ణయం మాత్రమే. కానీ, ప్రధానమంత్రి ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతున్నారు. రాష్ట్రాలను చూసే పద్ధతి ఇదేనా? అందుకే మేం అవిశ్వాసం పెట్టాం’ అని చంద్రబాబు తెలిపారు.

తాము మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో ప్రధానికి ఫోన్‌ చేశానని, ఆ సమయంలో ఆయన డిన్నర్‌ చేస్తున్నారని.. కానీ, ఉపసంహరణ విషయాన్ని ప్రధాని కార్యదర్శికి తెలియజేశానన్నారు. దీంతో మర్నాడు ప్రధాని తనకు ఫోన్‌చేసి.. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వలలో మీరు పడుతున్నారు’ అని అన్నారు. నేను సరైన పద్ధతిలో వెళ్లినప్పుడు ఏమీకాదని ఆయనకు చెప్పానని సీఎం వివరించారు. టీడీపీని వైఎస్సార్‌సీపీతో ఎలా పోలుస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు.. ఏడాదిలోగా అన్ని అవినీతి కేసుల్లో దర్యాప్తు పూర్తిచేస్తామని.. స్విస్‌ ఖాతాల నుంచి డబ్బులు తెచ్చి అందరికీ రూ.15లక్షల చొప్పున ఇస్తామని అనేకం చెప్పారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాగే, ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన ప్రయోజనాలను ఏపీకి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. 

నాకు పరిణితి లేదా?
‘హైదరాబాద్‌ ఆస్తులు అడిగినట్లు ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరం. అది నా బ్రెయిన్‌ చైల్డ్‌. అసలు హైదరాబాద్‌ను సృష్టించిందే నేను. ఈరోజు దానిని మించిన నగరం లేదు..’ అని సీఎం వివరించారు. ‘మేం హైదరాబాద్‌ను కోల్పోయాం. మా సెంటిమెంట్లను బాధించకూడదు. కేసీఆర్‌ నాకంటే పరిణితి కలిగిన వారట. నేను కాదట. ప్రధానమంత్రిగా ఉండి ఇలా మాట్లాడకూడదు. మోదీ 2002లో సీఎం అయ్యారు. కానీ, నేను 1995లోనే ముఖ్యమంత్రిని. అలాగే, నేను యూటర్న్‌ తీసుకోలేదు.. మోదీనే యూటర్న్‌ తీసుకున్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు. 

ఇది నమ్మక ద్రోహం..
‘ఇది నమ్మక ద్రోహం.. కుట్ర రాజకీయాలు. న్యాయం జరగడం కోసం రాష్ట్రంలో నేను అందరితో వెళ్తున్నాను. అందరికీ పెన్షన్లు వచ్చేందుకు బ్యాంకర్లతో మాట్లాడుతున్నాను. ఏటీఎంల్లో డబ్బులు లేవు. పెన్షన్లు, నరేగా కూలీలకు డబ్బులు అందడంలేదు. రూపాయి విలువ పడిపోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది. రైతులకు రెట్టింపు ఆదాయం అన్నారు.. ఇప్పటివరకూ ఏమీ చేయలేదు.. నిరుద్యోగం పెరుగుతోంది.. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి.. ప్రజలకు భద్రత లేదు. వీటిపై మేం పోరాడుతున్నాం..’ అని చంద్రబాబు మీడియాకు తెలిపారు.

అడగకున్నా కాంగ్రెస్‌ మద్దతిచ్చింది..
‘అవిశ్వాసంపై అనేక పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి. మేం కాంగ్రెస్‌ను అడగకపోయినా మాకు మద్దతిచ్చింది. నేను ఈ దేశంలో సీనియర్‌ రాజకీయవేత్తను. చాలా ప్రభుత్వాలు ఏర్పాటుచేశాను. నేషనల్‌ ఫ్రంట్‌ మా మామ ఏర్పాటుచేశారు. దానితో నాకు అనుబంధం ఉంది. నేను యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేశాను. ఇద్దరు ప్రధానమంత్రులు.. ఎన్డీయే–1, ఎన్డీయే–2కు మద్దతు ఇచ్చాను..’ అని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే.. 2019లో కాంగ్రెస్‌ వస్తే హామీలు నెరవేరుస్తామని అంటోంది.. మీరు ఆ పార్టీకి మద్దతు ఇస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. మీ అందరి కంటే నాకు రాజకీయాలు బాగా తెలుసని చంద్రబాబు సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీగా కొన్నిసార్లు కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటాయని.. ఊహాత్మక ప్రశ్నలు అడగకూడదన్నారు.

జాతీయస్థాయిలో మా పాత్ర మేం పోషిస్తామని.. ఎలా అన్నది కాలమే చెబుతుందన్నారు. మీ తదుపరి కార్యాచరణ ఏమిటని మీడియా ప్రశ్నించగా.. ‘రాష్ట్రంలో ఒక పార్టీ అధినేత నిన్న కోర్టులో ఉన్నారు.. ఆయన ఈరోజు ప్రెస్‌ మీట్‌ పెట్టారు. వాళ్లు రాజీనామా చేశారు. మేం వాళ్లను అనుసరించాలట. రాజీనామా చేశాక ఏం చేస్తారు? పవన్‌ కల్యాణ్‌ రోజంతా మాపై ట్వీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. అందరూ కలిసి న్యాయం కోసం పోరాడాలి’ అని చంద్రబాబు సమాధానమిచ్చారు.

బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా ఉండాలనుకున్న పార్టీల్లో ఒకరిపై ఒకరికి విశ్వాసంలేదని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. బీజేపీపై బీజేపీలో ఉన్నవారికి విశ్వాసం ఉందా? అని ఎదురు ప్రశ్నించారు. మమతా బెనర్జీ ప్రధాని పదవికి పోటీపడితే మీరు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించగా ‘మీకు సమస్యలు సృష్టించడం కావాలి.. ఈరోజు అది అంశం కాదు’ అని పేర్కొన్నారు. మీరు సీనియర్‌ అయినందున తనకు పోటీదారుగా నరేంద్ర మోదీ భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ..  ‘నేను ఎలాంటి పోస్టు ఢిల్లీలో ఆశించడంలేదు. 1995–96లో నాకు ఆ అవకాశం వచ్చింది’ అని చంద్రబాబు చెప్పారు.  

>
మరిన్ని వార్తలు