వైఎస్సార్ సీపీలోకి పలువురు నటులు

1 Apr, 2019 10:39 IST|Sakshi

వైఎస్సార్ సీపీలో చేరిన జీవితా రాజశేఖర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరగా తాజాగా సోమవారం పలువురు నటీనటులు ఆ పార్టీలో చేరారు. ప్రముఖ నటుడు రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవిత, యాంకర్‌, నటి శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి తదితరులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైఎస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హేమ కూడా వైఎస్‌ జగన్‌ను కలిశారు. 

చదవండి...(వైఎస్‌ జగన్‌ను కలిసిన జీవితా రాజశేఖర్‌)

అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జీవితా రాజశేఖర్‌ దంపతులు మీడియాలో మాట్లాడారు. నటుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ...వైఎస్‌ జగన్‌ ఇంత బిజీలో కూడా మాకోసం సమయం కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రజల కోసం పని చేస్తున్న జగన్‌కు ఒక అవకాశం ఇవ్వండి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి వైఎస్‌ జగన్‌ ‘నవరత్నాలు’  ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. వైఎస్ఆర్‌ తన హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైఎస్‌ఆర్‌ పథకాలనే చంద్రబాబు పేరు మార్చి.. తన ఘనతగా చెప్పుకున్నారు.’  అని అన్నారు.


ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి: జీవిత
జీవిత మాట్లాడుతూ..‘రాజశేఖర్‌ మనసులో ఏది అనిపిస్తే అడి మాట్లాడతారు. వైఎస్‌ జగన్‌ మీద అందరితో పాటు మేం కూడా అనేక ఆరోపణలు చేశాం. కానీ ఇప్పటికి కూడా ఆయనపై ఆ ఆరోపణలు రుజువు చేయలేదు. వైఎస్‌ జగన్‌ మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అవి వాస్తవాలు కాదు. వైఎస్‌ జగన్‌ స్థానంలో నేనుంటే ఆ కష్టాలకు భయపడేదాన్ని. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజల కోసం పోరాడుతున్నారు. ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఆయన పోరాటం ఆపలేదు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు హైటెక్‌ అంటే వైఎస్సార్‌ ప్రజల కష్టాలను చూశారు. పేద ప్రజలకు సాయం చేశారు. కానీ మన దురదృష్టం వైఎస్సార్‌ భౌతికంగా మనకు లేదు. దాంతో వైఎస్సార్‌ లేని కాంగ్రెస్‌ మాకొద్దని బయటకు వచ్చాం. స్వలాభం కోసం పార్టీలు మారలేదు. మేం కరెక్ట్‌గానే ఉన్నాం కాబట్టే ఎవరి దగ్గరికైనా వెళ్తాం.  

నేను అడుగుతున్నా...  చంద్రబాబు నాయుడు లాగా వైఎస్‌ జగన్‌ ...ఓ మహిళా ఎమ్మార్వోను కొట్టించారా?. 23మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారా? అలా ఏమీ చేయలేదు కదా?. పసుపు-కుంకుమతో మహిళలకు డబ్బులిస్తామని అంటున్నారు. మరి డ్వాక్రా రుణాల సంగతేంటి?. ఓట్ల కోసం టీడీపీ ప్రజలను ఏమారుస్తోంది. కేఏ పాల్‌ లాంటి వారు దొంగ దారిలో వస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గుర్తును పోలిన సింబల్‌తో పాటు, అభ్యర్థుల పేర్లనే తెరమీదకు తెచ్చారు. అడ్డదారిలో ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారు. ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా చూసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి’  అని విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు