అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా..

1 Apr, 2019 10:46 IST|Sakshi
కొట్టు సత్యనారాయణ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ 

సాక్షి, తాడేపల్లిగూడెం: నిజాయితీ, నిస్వార్థం, ప్రజలకు సేవ చేయాలనే కాంక్షగల ఆయన 25 ఏళ్ల క్రితం రాజకీయ రంగంలోకి వచ్చారు. స్వార్థపర, కుటుంబాల వారసత్వ పాలనకు చరమగీతం పాడటానికి ఎన్నికల యవనికపైకి వచ్చారు. ప్రజాశీస్సులే శ్రీరామరక్షగా.. అవకాశం ఇవ్వండి.. ఆగిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని అంటున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాడేపల్లిగూడెం అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’ఎదుట ఆవిష్కరించారు. 


ప్రశ్న : రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఏంటి
కొట్టు : 1994కు ముందు నాటికి తాడేపల్లిగూడెం రాజకీయాలు కలుషితం అయ్యాయి. సరైన వ్యక్తి కోసం కాంగ్రెస్‌ పార్టీ చూస్తుంది. అప్పటికే పారిశ్రామిక, వ్యాపార రంగంలో స్థిరపడి ఉన్న నాకు, నిస్వార్థంగా పనిచేసి ప్రజలకు సేవ చేయాలని పెద్దలు ఒప్పించి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చారు. అప్పటికి ఆ పార్టీకి రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిప్రాయం కారణంగా ఓటమి చెందాను. 55 వేల మంది ఓటేసి ఆశీర్వదించారు. 25 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను.


ప్రశ్న : ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తారు
కొట్టు : ఆగిపోయిన అండర్‌ గ్రౌండ్‌ 
డ్రెయినేజీ పనులను ఏడాదిలోగా పూర్తిచేసి దోమల రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దుతా. విమానాశ్రయ భూముల్లో నివాసం ఉన్నవారికి పట్టాలిస్తా. మౌలిక వసతుల కల్పనతో పాటు ఉద్యాన వర్సిటీ విస్తరణ పనులను పూర్తిచేస్తా. క్రీడాభివృద్ధి కోసం క్రికెట్‌ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, జిమ్నాస్టిక్స్‌ కోసం స్టేడియాల నిర్మాణం చేపడతా.


ప్రశ్న : మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది
కొట్టు : రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లుగా ప్రజలకు చేరువగా ఉంటున్న నాకు నా తండ్రి వెంకటేశ్వరరావు ప్రోత్సాహం అధికంగా ఉంది. సోదరులు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో స్థిరపడినా అవసరమైన సందర్భాల్లో సేవలు అందిస్తున్నారు. జీవిత భాగస్వామి గురించి చెప్పాలంటే ఆమె నా తోడు నీడగా ఉన్నారు. నాకు కుటుంబం గురించి పట్టించుకునే అవకాశం తక్కువగా ఉన్నా.. ఆమె అన్నీ తానై ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. పిల్లలు ఎవ్వరికి వారు స్థిరపడ్డారు. అవసర సమయంలో అండగా ఉంటున్నారు. 


ప్రశ్న : మీ విజయానికి దోహదం చేసే అంశాలు
కొట్టు : కేఎస్‌ఎన్‌ వస్తే ఆగిన అభివృద్ధి పరుగులు పెడుతుందనే ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరా మరక్ష. వారి అభిమానం, ఆదరణ నాకు విజ యం చేకూరుస్తాయి. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల పనితీరును ఐదేళ్లుగా ప్రజలు చూశా రు. కొట్టు పాలనకు వీరి పాలనకు మధ్య ఉన్న తేడాను బేరీజు వేసుకుంటున్నారు. టైంపాస్‌ రాజకీయాలు, విచ్చలవిడి  అవినీతికి పాల్పడిన పాలకులను ఆదరించే పరిస్థితి లేదు. ఒక్కసారి కొట్టుకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేశారు.. దమ్మున్న నాయకుడు అని పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. నేను చేసిన అభివృద్ధిని ప్రజలే చెప్పడం ఆనందంగా ఉంది. ఇదే గెలుపునకు తొలి మెట్టు. జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయి.  


ప్రశ్న : అప్పట్లో నియోజకవర్గ సమస్యలు ఏంటి
కొట్టు : నేను రాజకీయంలోకి వచ్చే నాటికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యాలు లేవు. అనుసంధాన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం, శాంతి భద్రతల పరిస్థితి కట్టుతప్పింది. మెట్ట ప్రాంత రైతాంగాన్ని ఎర్రకాలువ ముంపు సమస్య వెంటాడుతుంది. పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉంది. విద్యాపరంగా నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఈ సమస్యలు.. వాటి పరిష్కారాలపై అవగాహన పెంచుకున్నాను. వీటిని పరిష్కరించడమే ప్రజలకు కావాలని గ్రహించాను.


ప్రశ్న : సమస్యలకు పరిష్కారం ఎలా చూపించారు 
కొట్టు : వైఎస్, ప్రజల ఆశీస్సులతో 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశా. నియోజకవర్గంలో పల్లెలు, పట్టణాల మధ్య అనుసంధాన రోడ్లు జిల్లాలో ఎక్కడాలేని విధంగా నిర్మించాం. రోడ్లు విస్తరించడంతో పాటు ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రెండో ఫ్లైఓవర్‌ వంతెన నిర్మించాం. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, గోయంకా కళాశాలను అభివృద్ధి చేయడం, ఉద్యానవర్సిటీ, వెటర్నరీ పాలిటెక్నిక్‌ ఏర్పాటు చేశాం. విజయవాడ, విశాఖ మధ్య ఎక్కడా లేనివిధంగా భూగర్భ డ్రెయినేజీ పనులను ప్రారంభించాం. ఎర్రకాలువపై మూడు వంతెనలు నిర్మించాం. అరాచకశక్తుల ఆటకట్టించాను. 

 

మరిన్ని వార్తలు