‘పవన్‌.. అది చాలా ప్రమాదకరం’

9 Jul, 2018 11:35 IST|Sakshi

విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకో

పవన్‌ను హెచ్చరించిన కళా వెంకట్రావ్‌

విజయనగరం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావ్ మండిపడ్డారు. రాజకీయం తెలియనటువంటి వాళ్లు ప్రాంతాలు, మతాలను రెచ్చగొట్టడం చేస్తున్నారు. వాళ్లలో విష బీజాలు నాటేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందలేదు. వీటి కారణంగా రాబోయే తరాలు ఎంత బాధపడతారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలంటే ప్రాంతాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టేవి కాదు. ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం ఉందంటున్నారు. అయితే దానిపై నీ పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుంది. జనసేన అంటే సింగిల్‌ మ్యాన్‌ ఆర్మీ. అది కూడా కాదు కేవలం వన్‌ మ్యాన్‌ షో అనొచ్చు.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సహా మిగతా పెద్దలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టి సేవ చేస్తామని వచ్చారు. కానీ విద్వేష రాజకీయాలు చేయడం మంచిది కాదు. ప్రజలను రెచ్చగొట్టటంతో అందరికీ ప్రమాదమే. కాపుల రిజర్వేషన్లపై పవన్‌ మాట్లాడుతున్నారు. పవన్‌.. మీ స్నేహితులు బీజేపీ వాళ్ల దగ్గర ఉన్న రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో పాస్‌ చేయించాలి. అయితే ఇలా చేసి ఓ సామాజిక వర్గానికి సాయం చేయడం మానేసి ప్రాంతాలు, కులాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టడం తగదు. జనసేనది అనేది స్వరూపం లేని పార్టీ. మీ పార్టీ పాలసీ ఏంటి, స్వరూపం ఏంటో చెప్పడం నాయకుల లక్షణం. తెల్లవారితే సీఎం చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్‌పై, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడం తగదని’ పవన్‌ కల్యాణ్‌కు కళా వెంకట్రావ్‌ సూచించారు.

మరిన్ని వార్తలు