రాయలసీమ ద్రోహి చంద్రబాబు

6 Jul, 2020 11:31 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి

ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

పత్తికొండ టౌన్‌: రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి అమరావతి కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ దందా నడిపిన మాజీ సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ధ్వజమెత్తారు. ఆదివారం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని గత టీడీపీ పాలకులు పూర్తిగా విస్మరించారన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర  ప్రాంతాల్లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపడుతుంటే చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని అయిన కర్నూలును న్యాయరాజధానిగా చేసి హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. శాసనమండలిలో, కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.

కొద్దిమంది కోసమే సేవ్‌ అమరావతి
చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం వహించారన్నారు. అమరావతి చుట్టూ ఆయన బంధువులు, సొంత సామాజికవర్గం వారు, టీడీపీ నాయకులు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాల ద్వారా కోట్లు కొల్లగొట్టాలన్నారు. కొద్దిమంది ప్రయోజనాల కోసం చంద్రబాబు సేవ్‌ అమరావతి అంటూ డ్రామాలు ఆడుతున్నాడని  విమర్శించారు.  29 గ్రామాల్లో ప్రారంభమైన ఉద్యమం ప్రస్తుతం 3 గ్రామాలకే పరిమితమయ్యిందన్నారు. అక్కడ కూడా చంద్రబాబు ఆదేశాల మేరకు ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఉద్యమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు