చక్రం తిప్పిన సబితమ్మ : అనూహ్యంగా యువనేతకు పట్టం

27 Jan, 2020 15:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ రేపిన తుక్కుగూడ మున్సిపాలిటీని అనూహ్య పరిణామాల నడుమ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మంత్రి సబితారెడ్డి సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో కీలకమైన తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఇక్కడ ఉన్న 15 వార్డుల్లో బీజేపీ 9, టీఆర్ఎస్ 5 గెలుచుకోగా, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 

బీజేపీకి మెజారిటీ వచ్చినప్పటికీ తగినంతమంది ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతు లేకపోవడంతో రెండో వార్డులో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కాంటేకర్ మధుమోహన్ కీలకంగా మారారు. ఈ క్రమంలో తగినంత ఎక్స్ అఫీషియో ఓట్లను కూడగట్టడంతోపాటు యువనేత మధును పార్టీలోకి సబితమ్మ ఆహ్వానించారు.  బీసీ వర్గానికి చెందిన మధుకు తుక్కుగూడ మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్ పదవిని అప్పగించారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తనకు కీలకమైన తుక్కుగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.

స్వతంత్ర అభ్యర్థిని వరించిన చైర్మన్ పీఠం
స్థానిక యువ నాయకుడు మధు మున్సిపాలిటీలోని రెండోవార్డు నుంచి కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మెజారిటీ వార్డుల్లో గెలుపొందిన బీజేపీ చైర్మన్గా పోటీకి తీవ్ర కసరత్తు చేసింది. అయితే, ఎక్స్‌అఫీషియో సభ్యులతో బీజేపీ ప్రణాళిక తారుమారైంది. టీఆర్‌ఎస్ లో చేరిన స్వతంత్ర అభ్యర్థి మధు కాంటేకర్ ను చైర్మన్ అభ్యర్థిగా మంత్రి సబితారెడ్డి నిర్ణయించి పావులు కదిపారు.  చివరి నిమిషంలో అనూహ్యంగా ఎక్స్‌అఫీషియో సభ్యుల రంగ ప్రవేశంతో మొత్తం పరిస్థితి తారుమారైంది. టీఆర్‌ఎస్ నాయకులు చైర్మన్‌గా మధుమోహన్, వైస్‌ చైర్మన్‌గా భవాని వెంకట్‌ రెడ్డి విజయం సాధించారు.

మరిన్ని వార్తలు