మళ్లీ హంగ్ వస్తుందా ?  

8 May, 2018 08:24 IST|Sakshi

గతంలో మూడుసార్లు త్రిశంకు సభలు చూసిన కర్ణాటక

సాక్షి, బెంగళూరు : కర్ణాటక 15వ శాసనసభ ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీకి దారితీస్తాయని అత్యధిక సర్వేలు చెబుతున్నాయి. గత 35 ఏళ్లలో రాష్ట్రంలో మూడుసార్లు (1983, 2004, 2008)) మాత్రమే త్రిశంకు సభలు ఏర్పడ్డాయి. తొలి హంగ్అసెంబ్లీ రెండేళ్లు మాత్రమే కొనసాగింది. 14 సంవత్సరాల క్రితం ఏర్పడిన త్రిశంకు సభ నాలుగేళ్లు నడిచింది. మూడో హంగ్అసెంబ్లీ కొద్ది కాలానికే పాలకపక్షమైన బీజేపీకి మెజారిటీ సమకూరడంతో ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 1983 ఎన్నికల తర్వాత ఏర్పడిన హంగ్అసెంబ్లీ కాలాన్ని మినహాయిస్తే మిగిలిన రెండు సార్లూ ముగ్గురు చొప్పున ముఖ్యమంత్రులు మారారు. మరో విశేషమేమంటే, గతంలో త్రిశంకు సభకు దారితీసిన ఎన్నికలకు ముందు మూడు సందర్భాల్లోనూ ఐదేళ్లు పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి లేరు. 

తొలి ‘హంగ్’తో సీఎం అయిన రామకృష్ణ హెగ్డే!
ఆంధ్రప్రదేశ్తో పాటు తొలి కాంగ్రెసేతర సర్కారు ఏర్పాటుకు దారితీసిన 1983 జనవరి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో మొదటి త్రిశంకుసభ ఏర్పడింది. మొత్తం 224 సీట్లున్న అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో అప్పటి పాలకపక్షమైన కాంగ్రెస్ఓడిపోవడమేగాక సీట్ల విషయంలో రెండో పెద్ద పార్టీగా(82) దిగజారింది. ఏ పార్టీకి మెజారిటీరాని ఈ ఎన్నికల్లో జనతాపార్టీ 95 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బయటి నుంచి సీపీఐ, సీపీఎం(మూడేసి సీట్లు), కర్ణాటక క్రాంతిరంగ అనే ప్రాంతీయపక్షం, ఇండిపెండెంట్ల మద్దతుతో జనతాపార్టీ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు రెండేళ్లు ఈ సర్కారు పాలన సాఫీగా సాగాక ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 లోక్సభ ఎన్నికల్లో పాలకపక్షమైన జనతాపార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్మూడింటి రెండు వంతులకు పైగా ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో జనతా ఘోర పరాజయంతో విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నానంటూ అసెంబ్లీని రద్దుచేయించి హెగ్డే  తాజాగా ప్రజల తీర్పు కోరారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా 139 సీట్లు సంపాదించిగా హెగ్డే మరోసారి సీఎం అయ్యారు. 

2004 త్రిశంకు సభతో పార్టీల కుర్చీలాట!
కాంగ్రెస్సీనియర్నేత ఎస్ఎం కృష్ణ నాలుగేళ్ల ఏడు నెలలు సీఎంగా కొనసాగాక జరిగిన 2004 ఎన్నికల ఫలితాలు అసలు సిసలు హంగ్అసెంబ్లీకి దారితీశాయి. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి 79 సీట్లు సాధించింది. ఓడిపోయిన పాలకపక్షం కాంగ్రెస్65, జేడీఎస్58 సీట్లు గెల్చుకున్నాయి.  మొదట జేడీఎస్తో పొత్తుకు బీజేపీ సీనియర్నేతలు అరుణ్జైట్లీ, ఎం.వెంకయ్య నాయడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్, గౌడ పార్టీ మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. అయితే, తన సామాజికవర్గానికే(ఒక్కళిగ) చెందిన తన రాజకీయ ప్రత్యర్థి కృష్ణకు సీఎం పదవి ఇవ్వడానికి దేవెగౌడ నిరాకరించడంతో ఉత్తర కర్ణాటకకు చెందిన మరో కాంగ్రెస్నేత ఎన్.ధరమ్సింగ్ఈ కాంగ్రెస్జేడీఎస్సంకీర్ణానికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు జేడీఎస్లో ఉన్న ప్రస్తుత సీఎం సిద్దరామయ్యకి ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. తనకు ఎదురు తిరిగిన సిద్ధూను 2005 నవంబర్లో గౌడ పదవి నుంచి తప్పించాక కాంగ్రెస్తో పెరిగిన విభేదాల ఫలితంగా  ఏడాది 8 మాసాలకే జేడీఎస్మద్దతు ఉపసంహరించడంతో ధరమ్సింగ్సర్కారు 2006 జనవరి ఆఖరులో కూలిపోయింది. 

కుమారస్వామితో చేతులు కలిపిన బీజేపీ
రాష్ట్ర జేడీఎస్నేతగా నియమితుడైన దేవెగౌడ కుమారుడు కుమారస్వామి తండ్రి అనుమతి లేకుండా తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతో అవగాహనకు వచ్చారు. బీజేపీ భాగస్వామిగా సంకీర్ణ సర్కారు సీఎంగా 2006 ఫిబ్రవరి మూడున ఆయన ప్రమాణం చేశారు. తన అనుమతి లేకుండా తన కొడుకు కాషాయపక్షంతో చేతులు కలిపారంటూ దేవెగౌడ నెత్తీనోరూ బాదుకున్నారు. తన కళ్ల ముందే తన కొడుకు మతతత్వ పార్టీతో కుమ్మక్కవడం అన్యాయమని కన్నీళ్లు పెట్టుకున్నారు. జేడీఎస్కు చెందిన 46 మంది ఎమ్మెల్యేలను చీల్చి కుమారస్వామి బీజేపీతో జతకట్టారు. కొన్నాళ్లుకు సీఎం అయిన తన కుమారుడుకి గౌడ మద్దతు పలకడంతో కథ సుఖాంతమైంది.

కాని 20 నెలల తర్వాత సీఎం పదవిని బీజేపీ నేత బీఎస్యడ్యూరప్పకు ఇవ్వాలన్న ఒప్పందానికి కట్టుబడి కుమారస్వామి రాజీనామా చేయకపోవడంతో మళ్లీ సంక్షోభం మొదలైంది. 18 మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేసి, ఆ పార్టీ మద్దతు ఉపసంహరించాక కుమారస్వామి  రాజీనామా చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా బీజేపీ యడ్యూరప్ప నేతృత్వంలో ఏర్పాటు చేసిన సర్కారు వారం రోజులకే రాజీనామా చేసింది. ఇలా త్రిశంకు సభకు కారణమైన 12వ అసెంబ్లీ ముగ్గురు ముఖ్యమంత్రులను చూసింది. దాదాపు 190 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత అసెంబ్లీని అప్పటి యూపీఏ కేంద్రసర్కారు రద్దుచేయించి ఎన్నికలు జరిపించింది.

‘త్రిశంకు’గా మొదలైన 13వ అసెంబ్లీ కాలంలో ముగ్గురు బీజేపీ సీఎంలు
2008 మే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు(110) దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. తన పార్టీకి సాధారణ మెజారిటీకి మూడు సీట్లు తగ్గడంతో ఇండిపెండెంట్ల మద్దతుతో యడ్యూరప్ప రెండోసారి మే 30న ముఖ్యమంత్రి అయ్యారు. ‘ఆపరేషన్కమల్’ పేరుతో కొందరు కాంగ్రెస్, జేడీఎస్ఎమ్మెల్యేలతో శాసససభ్యత్వానికి రాజీనామా చేయించి వారిని తన టికెట్పై బీజేపీ గెలిపించింది. ఇలా బీజేపీ బలం 113 దాటిపోయింది. సర్కారుపై అవినీతి ఆరోపణలు, బళ్లారి గాలి జనార్దన్రెడ్డి సోదరులతో గొడవలు, కీచులాటల ఫలితంగా మూడేళ్ల రెండు నెలల తర్వాత 2011 జులై 11న యడ్యూరప్పను బీజేపీ కేంద్ర నాయకత్వం సీఎం పదవి నుంచి తప్పించింది.

ఆయన తర్వాత సీఎం పదవి చేపట్టిన డీవీ సదానంద గౌడ కూడా పార్టీలో ముఠా తగాదాలు కారణంగా ఏడాది నిండకుండానే 2012 జులైలో రాజీనామా చేయాల్సివచ్చింది. ఆయన తర్వాత మూడో బీజేపీ సీఎం అయిన జగదీష్షెట్టర్అసెంబ్లీ పదవీ కాలం పూర్వయ్యే వరకూ అంటే 2013 మే 12 వరకూ కొనసాగారు. 14వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్122 సీట్లు కైవసం చేసుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఇలా మూడుసార్లు త్రిశంకు సభలను చూసిన కర్ణాటక ప్రజలు నాలుగోసారి మరో హంగ్అసెంబ్లీకి అనుకూలంగా తీర్పు ఇస్తారా? లేక రెండు ప్రధాన జాతీయపక్షాల్లో ఒకదానికి సంపూర్ణ మెజారిటీ అప్పగిస్తారా? అనే ప్రశ్నలకు ఈ నెల 15 వెలువడే ఫలితాలు జవాబిస్తాయి. 
 - సాక్షి నాలెడ్జ్ సెంటర్

>
మరిన్ని వార్తలు