కేసీఆర్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం: జైపాల్‌రెడ్డి

4 Mar, 2018 05:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్, భారతీయ జనతా పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని కేంద్ర మాజీమంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రగతిశీలశక్తులు, అల్ప సంఖ్యాక వర్గాలను మోసం చేసేందుకే కేసీఆర్‌ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతోపాటు అనేక అంశాల్లో కేసీఆర్‌ బీజేపీకి మద్దతిచ్చారని, సిద్ధాంతపరంగా వారి మధ్య రహస్య అవగాహన ఉందన్నారు. 2014లోనే బీజేపీతో సర్దుకుపోయేందుకు ప్రయత్నించారని, అయినా టీడీపీ, బీజేపీలు టీఆర్‌ఎస్‌ను తిరస్కరించాయని చెప్పారు.

ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీతో విడిపోయినా ఎన్నికల తర్వాత కేసీఆర్‌ బీజేపీతో కచ్చితంగా కలుస్తారని జోస్యం చెప్పారు. ఏకవచనంతో మాట్లాడటం కేసీఆర్‌కు అలవాటేనని, మోదీనే కాదు రాహుల్‌గాంధీని కూడా ఆయన ఏకవచనంతోనే సంబోధించారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తానెప్పుడూ బయట మాట్లాడలేదని, ఆ అలవాటు తనకు లేదని చెప్పిన జైపాల్‌ తాను ఈసారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తానని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు