‘తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు’

19 Nov, 2018 13:04 IST|Sakshi
కోదండరాం(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరంకుశ పాలన అంతమొందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. తమ పార్టీ పెట్టిన నాలుగు నెలల్లోనే సంఘాన్ని నిలబెట్టామని గర్తుచేశారు. జేఏసీ నుంచి మరికొంత బలాన్ని సమీకరించకున్నట్టు తెలిపారు. జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు జరిపామని అన్నారు. రాజకీయరంగం మారకుండా సమస్యలకు పరిష్కారం లభించదనే భావనతో జనసమితి అవిర్భవించిందని పేర్కొన్నారు. అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని.. తాము ఆశిస్తున్నది సామాజిక మార్పు అని వెల్లడించారు.

ఎన్నికల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం అనేది భారతదేశంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి అని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయ విధానాలకు రూపకల్పన చేయగలిగిన మార్పు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అనేక విమర్శలను దృష్టిలో పెట్టుకుని పీపుల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి ఘర్షణ నుంచి ఒక ఐకత్యను నెల రోజుల చర్చల్లో గమనించినట్టు ఆయన తెలిపారు. ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోరాడగలిగే కొత్తతరం నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. తాము గరికె గడ్డి లాంటి వాళ్లమని.. పీకేసిన కొద్ది మొలుస్తూనే ఉంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ ఎజెండా గెలిస్తే.. తాము గెలిచినట్టేనని అన్నారు.

మరిన్ని వార్తలు