అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

24 May, 2018 01:50 IST|Sakshi

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: కోదండరాం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోమని, తమ పార్టీకి తగిన సామర్థ్యం ఉందని, దాన్ని నిరూపించుకుంటామని చెప్పారు. పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం టీజేఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం టీజేఎస్‌పై ఇంటెలిజెన్స్‌ సర్వే చేయించిందని, 26 సీట్లు వస్తాయని తేలిందని, కింగ్‌మేకర్‌ కాబోతున్నారని విలేకరులు పేర్కొనగా.. కింగ్‌మేకర్‌ ఏమోకానీ కింగ్‌గా ఉంటామన్నారు.

మీరు అధికారంలోకి వస్తారా.. రాష్ట్రంలో హంగ్‌ వస్తుందా? అని ప్రశ్నించగా.. ‘‘ఆ అంచనాలకు ఇంకా సమయం ఉంది. హంగ్‌ రాదు. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ ఇస్తారు. మేమే అధికారంలోకి వస్తాం. రాజకీయాలను మేం మార్చుతాం. ప్రభుత్వం రాజకీయాలపై ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం సరికాదు. ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది’’ అని అన్నారు. కర్ణాటక పరిణామాలపై స్పందిస్తూ.. స్థానిక ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని, జాతీయ పార్టీలు స్థానికుల ఆకాంక్షలను పట్టించుకోకపోవడం వల్లే స్థానిక పార్టీ్టలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి, వ్యాపారానికి, రాజకీయానికి అనైతిక సంబంధం కొనసాగుతోందని, సుప్రీంకోర్టు కోర్టు జోక్యంతో కర్ణాటకలో అది నిలిచిపోయిందని చెప్పారు.

ముడి చమురు రేటు తగ్గినా.. 
పెట్రోలు, డీజిల్‌ ధరలపై టాక్స్‌లను సవరించి, జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. అలాగే పెట్రోలుపై టాక్స్‌ల తగ్గింపు విషయంలో నిపుణుల కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలన్నారు. ముడి చమురు రేటు తగ్గినా ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుతోందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్‌ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 27న అవగాహన సదస్సు నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. 

ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదుకు శ్రీకారం 
ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానంలో సభ్యత్వ నమోదుకు టీజేఎస్‌ శ్రీకారం చుట్టింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల నుంచి టీజేఎస్‌ తరఫున పోటీ చేయాలనుకునే యువతకు తమ వెబ్‌సైట్‌ ద్వారా (www.telanganajanasamithiparty.org) ఆన్‌లైన్‌ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే దాదాపు 850 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో సగటున రోజుకు వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయని కోదండరాం చెప్పారు.  

మరిన్ని వార్తలు