కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి ఓకే చెప్పిన కోదండరాం

30 Oct, 2023 13:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోదండరాం మద్దతు తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తెలంగాణ జనసమితి పార్టీ సిద్ధమైంది.  అంతేకాకుండా... విశాల ప్రయోజనాల దృష్టా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితి పోటీకి దూరంగా ఉండనుంది.

కాగా నాంపల్లిలోని తెలంగాణ జన సమితి  కార్యాలయానికి సోమవారం కాంగ్రెస్‌ నేతలు వెళ్లారు. ఆ పార్టీ అధినేత కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి జోసురాజు,  తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సిందిగా కోదండరాంను కోరారు.

ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్ధుబాటు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజేఎస్‌కు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటికి కలిసి పనిచేద్దామని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోదండరాం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. 
చదవండి: మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోదండరాం పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ సూచనల మేరకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాల్సిందిగా కోదండరామ్‌ను కోరేందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పారు.

భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామని, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేలా టీజేఎస్ కమిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్న రేవంత్‌ రెడ్డి.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. లక్ష్యం గొప్పది దాని కోసం కలిసి పని చేస్తామని, నియంతను గద్దె దించాలనేది ప్రధాన అజెండాగా తెలిపారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని చెప్పారు.

మరిన్ని వార్తలు