నాగం.. ఆ విషయం గుర్తుంచుకో: బీజేపీ

24 Mar, 2018 19:48 IST|Sakshi
కృష్ణసాగర్ రావు, నాగం జనార్ధన్ రెడ్డి (ఫైల్ ఫొటో)

సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో నాగం జనార్ధన్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యుడు స్థానం ఇచ్చి గౌరవించామని, కానీ ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన పార్టీకి రాజీనామా చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. గత రెండు రోజులుగా బీజేపీ సీనియర్ నేతలపై నాగం చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ సిద్ధాంతాలు పక్కనపెట్టి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడికి గత ఎన్నికల్లో టికెట్లు కేటాయించిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. బీజేపీపై అవాస్తవ ఆరోపణలు చేయకుంటే బాగుంటుందని కృష్ణసాగర్ రావు సూచించారు. 

నాగం రాజీనామా ఆయన వ్యక్తిగత నిర్ణయమన్నారు. ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు అవినీతి పోరాట కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించినా ఆయన స్వప్రయోజనాలు కోరుకుని కాంగ్రెలో చేరుతున్నారని విమర్శించారు. మా పార్టీలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న నేతలకు ఇవ్వని హోదా, గౌరవం నాగం జనార్ధన్‌రెడ్డికి ఇచ్చినా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌లో చేరారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ అంగీకారంతోనే ప్రభుత్వంపై కోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చేసిన పోరాటాలు ప్రజలకు కనిపిస్తున్నాయి కానీ నాగం జనార్ధన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క కేసుయినా నమోదు చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో నేతలకు స్వేచ్ఛ లేదని, ఆ పార్టీ టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందని బీజేపీ నేత కృష్ణసాగర్ రావు విమర్శించారు.

 

మరిన్ని వార్తలు