Madhya Pradesh Elections: బీజేపీలో పెరుగుతున్నకుమ్ములాటలు.. సింధియాకు అగ్నిపరీక్ష

11 Nov, 2023 07:54 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికలు ఇంకా వారం కూడా లేని వేళ మధ్యప్రదేశ్‌లో కీలకమైన గ్వాలియర్‌–చంబల్‌ ప్రాంతం అధికార బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీలోని పాత నేతలకు, మూడేళ్ల కింద కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయులకు అస్సలు సరిపడకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఈ ప్రాంతంలో 34 కీలక అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ మంచి ఫలితాలు సాధించడం కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ చాలా కీలకం.

అలాంటి ప్రాంతంలో పాత, కొత్త నేతలు సయోధ్యకు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వంతో పాటు సింధియాకు కూడా ఇబ్బందికరంగానే మారింది. పైగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై జనంలో నెలకొన్న వ్యతిరేకత కూడా దీనికి తోడయ్యేలా కని్పస్తుండటం మరింత గుబులు రేపుతోంది. ఈసారి గ్వాలియర్‌ ప్రాంతంలో బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్యపై పారీ్టలో సింధియా భవితవ్యం కూడా చాలావరకు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది... 

అది గ్వాలియర్‌లోని హజీరా ప్రాంతం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇంధన మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తోమర్‌ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటెయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటెయ్యాల్సిందిగా కోరారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన అనంతరం యువ నేత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న 16 మంది ఎమ్మెల్యేల్లో తోమర్‌ ఒకరు. ఆయన రాకతో కినుక వహించిన స్థానిక బీజేపీ నేతలు ఇప్పుడాయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారు.

దాంతో ఒకరకంగా ఆయనది ఒంటరి పోరుగానే మారింది. ఆయనకు మాత్రమే కాదు, బీజేపీ టికెటిచ్చిన సింధియా వర్గానికి చెందిన మరో 17 మంది నాయకులకూ దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది! అంతేగాక ఓటర్లు కూడా వారిపట్ల నిరాసక్తతే చూపుతున్నారు. ‘‘వారికే పరస్పరం కుదరడం లేదు. అలాంటి వాళ్లకు మా మంచీ చెడూ గురించి ఆలోచించేంత సమయం ఎక్కడుంటుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు! 

బీజేపీ వర్సెస్‌ సింధియా వర్గం 
2020 మార్చిలో 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి సింధియా బీజేపీలో చేరారు. దాంతో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. వారంతా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి. గ్వాలియర్‌–చంబల్‌ ప్రాంతంలో ఇలా రాజీనామా చేసిన 16 మందిలో 9 మంది తిరిగి నెగ్గారు. దాంతో అక్కడ బీజేపీ బలం 16కు పెరిగింది. ఈసారి ఆ స్థానాలన్నింటినీ నిలుపుకోవడంతో పాటు మరిన్ని చోట్ల నెగ్గాల్సిన కఠిన పరీక్ష సింధియా ముందుంది. కానీ పరిస్థితులు ఆయనకు అంత సానుకూలంగా కనిచడం లేదు. ఆ ప్రాంత ప్రజల్లో మెజారిటీ సింధియా నిర్ణయాన్ని తప్పుబడుతుండటం విశేషం.

ఆయనసలు కాంగ్రెస్‌ను వీడాల్సిందే కాదన్నది వారి నిశి్చతాభిప్రాయం. దీనికి తోడు సింధియా వర్గానికి చెందిన 18 మందికి బీజేపీ నాయకత్వం టికెట్లివ్వడం కూడా పార్టీలో విభేదాలకు కారణమైంది. పలువురు ఆశావహులు పార్టీలు మారి బరిలో దిగి సవాలు విసురుతున్నారు. మోరెనా అసెంబ్లీ స్థానంలో సింధియా వర్గం ఎమ్మెల్యే రఘురాయ్‌ కన్సానాకు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాకేశ్‌ రుస్తుం సింగ్‌ బీజేపీని వీడారు. బీఎస్పీ టికెట్‌పై బరిలో దిగి సవాలు విసురుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును ఆయన గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు.

పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి! దీన్ని గమనించే బీజేపీ ట్రబుల్‌ షూటర్, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అక్టోబర్‌ 30 నుంచి వారంలోపే ఏకంగా రెండుసార్లు గ్వాలియర్‌–చంబల్‌ ప్రాంతంలో పర్యటించారు. అసంతృప్త పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరిపి బుజ్జగించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.‘‘అసలు బీజేపీ నేతల్లోనే చాలామంది సింధియాను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఈసారి ఆ పారీ్టకి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది’’ అని రాజకీయ, మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి గ్వాలియర్‌ రాజ వంశీకునిగా సింధియాపై ఈ ప్రాంతవాసులకు చెప్పలేనంత అభిమానముంది. కానీ ఆయన పార్టీ మారిన తీరు వారికి పెద్దగా నచ్చలేదు. 

వ్యతిరేక పవనాలు...! 
అంతేగాక మధ్యలో ఓ ఏడాదిన్నర మినహా రాష్ట్రంలో 18 ఏళ్లుగా బీజేపీ పాలనే సాగుతుండటంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా సింధియాకు ప్రతికూలంగా మారుతోంది. ‘‘నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాకొచ్చే రోజువారీ కూలీ ఏ మూలకూ చాలడం లేదు. పోయినసారి బీజేపీకి ఓటేశాం. ఈసారి మాత్రం కాంగ్రెస్‌కే వేసి చూద్దామనుకుంటున్నాం’’ అన్న మాలతీ కిరార్, ఆమె సోదరుడు యోగేంద్ర మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంజనీరింగ్‌ పూర్తి చేసినా తనకిప్పటికీ ఉద్యగం దొరకలేదని భగవాన్‌ దాస్‌ అనే యువకుడు వాపోయాడు. ‘‘మూడేళ్లుగా ప్రభుత్వోద్యోగాల భర్తీయే లేదు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?’’ అన్న ఆయన ప్రశ్న యువతలో కూడా కమలం పార్టీకి సానుకూలంగా లేదనేందుకు రుజువేనంటున్నారు. 

మరిన్ని వార్తలు