తెలంగాణలో పోటీ చేస్తా: లగడపాటి

30 Jan, 2019 17:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వీవీప్యాట్‌లను లెక్కిస్తే అనుమానాలు తీరతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్‌ శాతం ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఒకటిన్నర రోజు ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా విజయం​ సాధించిన తర్వాత వెంటనే జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం గణనీయంగా పుంజుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై సమీక్ష చేసుకుంటున్నానని వెల్లడించారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, రాజకీయ సన్యాసానికి కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించనని తెలిపారు.

తెలంగాణలో పోటీ చేస్తా
అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడానని లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని విలేకరుల ప్రశ్నించగా... చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, రాజకీయాల్లో మళ్లీ చేరాలనుకుంటే చెప్పే చేస్తానని సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసి ఏం మాట్లాడారని అడగ్గా... చంద్రబాబుకు, తనకు మధ్య జరిగిన విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత లగడపాటి హఠాత్తుగా ఢిల్లీలో మీడియాకు ముందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం)

మరిన్ని వార్తలు