జాడలేని చిలక జోస్యం

12 Dec, 2018 11:21 IST|Sakshi
లగడపాటి రాజగోపాల్‌

లగడపాటి రాజగోపాల్‌ సర్వే ఉల్టా

ఎవరి కోసమో చేపట్టిన సర్వే.. ‘స్వతంత్రు’లే పాచికలు

ప్రజా కూటమే గెలుస్తుందని నమ్మించే ఎత్తుగడ

ముస్లిం ఓటర్లను దారి మళ్లించే కుట్ర

బీజేపీ బలపడుతోందని మరో డ్రామా

బోల్తాకొట్టిన లగడపాటి సర్వే నివేదిక

సాక్షి, అమరావతి: తెలంగాణలో కూటమి కుయుక్తల్లో లగడపాటి సర్వే ఓ భాగమా? తెలుగుదేశం పార్టీ సాగించిన మైండ్‌గేమ్‌కు అనుగుణంగానే సర్వే పేరుతో డ్రామా నడిపారా? రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ చెప్పిన చిలకజోస్యం తలకిందులైంది. కేసీఆర్‌ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని జాతీయ ఛానళ్లన్నీ ఒకవైపు చెబుతున్నా... లగడపాటి మాత్రం భిన్నమైన సర్వే రిపోర్టును తీసుకొచ్చి గందరగోళానికి తెర లేపారు. అయితే, మంగళవారం వెలువడిన ఫలితాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లగడపాటి చెప్పిన మాటలకు, వెలువడిన ఫలితాలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. (వికటించిన రాజకీయ కుట్ర!)

ఎవరి కోసమో రూపొందించినట్టు, ఒక పార్టీ ప్రయోజనం కోసమే అన్నట్టుగా ఏమాత్రం శాస్త్రీయత లేని సర్వే ఫలితాలను లగడపాటి వెల్లడించినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఫలితాలు అంచనాలకే అందడం లేదని తొలుత చెప్పిన లగడపాటి, ఆ తర్వాత ప్రజానాడి కూటమి వైపే ఉందన్నారు. ఆయన చెప్పిన సర్వే వివరాలన్నీ రాజకీయంగా ప్రజా కూటమిని గట్టెక్కిండానికి, టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికే అన్నట్టు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తున్నారనే భ్రమలు కల్పించడం, బీజేపీ బలం పెరుగుతోందని చెప్పడం... ఇలా ప్రతీ అంశంలోనూ లగడపాటి ఎవరి ప్రయోజనం కోసమే సర్వే చేసినట్టుగా సుస్పష్టమైంది.

ఎక్కడైనా పోలికుందా?
ఎన్నికల్లో ప్రజాకూటమి 65 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించి, అధికారం దిశగా పరుగులు పెడుతుందనేది లగడపాటి సర్వే సారాంశం. టీఆర్‌ఎస్‌ 35 నుంచి 45 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పారు. కానీ, ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మీడియా ముందుకు మొదటిసారి వచ్చిన లగడపాటి స్వతంత్ర అభ్యర్థులు 8 నుంచి 10 మంది గెలుస్తారని అన్నారు. వీరిలో ఇద్దరి పేర్లను కూడా వెల్లడించాడు. అయితే, ఈ ఇద్దరూ గెలవకపోవడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పడమే లగడపాటి మాటల ఉద్దేశమని తెలుస్తోంది. బెల్లంపల్లి, బోథ్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, నారాయణపేట, మక్తల్, వైరా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారనే భ్రమ కల్పించి, అంతిమంగా టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేలా సర్వే పేరిట పక్కా స్కెచ్‌ వేసినట్టు తేటతెల్లమవుతోంది. మొత్తం మీద 8 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర జరిగినట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పరోక్షంగా కూటమికి మేలు చేయడానికే లగడపాటి సర్వే నాటకాలు ఆడినట్లు స్పష్టమతోంది.

బీజేపీ బలపడిందట!
ఈ ఎన్నికల్లో పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. ఈ పరిస్థితిని మార్చడానికి బీజేపీ బలపడిందని, కొన్నిచోట్ల టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఉందని లగడపాటి చెప్పుకొచ్చారు. బీజేపీ పోటీలో ఉన్న ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్‌పేటను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. ముస్లింల ఓట్లను వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్‌కు దూరం చేసే ఎత్తుగడ సర్వేలో కన్పించింది. ముస్లింల ఓట్లు తెరాస కంటే కాంగ్రెస్‌కు ఎక్కువగా పడతాయని చెప్పడమే ఇందుకు నిదర్శనం.

ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా?
కీలకమైన సమయాల్లో ప్రజలను గందరగోళంలోకి నెట్టడం లగడపాటి రాజగోపాల్‌కు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ వర్గాల్లో ఓ విమర్శ ఉంది. దీనికి పలు కారణాలు చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ లగడపాటి ఇదే తరహాలో వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని చెప్పారు. అది నిజమని నమ్మించడానికి తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. రాష్ట్రావతరణ తర్వాత లగడపాటి ముఖం చాటేశారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన సర్వే ఫలితాలు నిక్కచ్చిగా ఉంటాయని నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

కాసేపు ప్రీపోల్‌... ఇంకాసేపు ఎగ్జిట్‌ పోల్‌
లగడపాటి సర్వే ఫలితాలను ప్రజా కూటమి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించింది. అయితే, ఎన్నికల ముందు, తర్వాత ఆయన వెల్లడించిన ఫలితాల సందర్భంగా ఆయనే కొంత గందరగోళానికి గురయ్యారు. అవన్నీ ప్రీపోల్‌ సర్వే అని కొన్నిసార్లు, ఎగ్జిట్‌పోల్‌ అని మరికొన్ని సార్లు చెప్పారు. ప్రీపోల్‌ నిజమైతే పెరిగిన ఓటింగ్‌ను అంచనా వేసే అవకాశం లేదు. ఎగ్జిట్‌పోల్‌ నిజమైతే పెరిగిన ఓటింగ్‌ ఎటువైపు అని చెప్పడంలో లగడపాటి జోస్యంలో స్పష్టత కన్పించలేదు. మొత్తం మీద చంద్రబాబు గుప్పిట్లో చిక్కిన చిలుకలా లగడపాటి ఆయనకు అనుకూలంగా సర్వే జోస్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన విశ్వసనీయతను పోగొట్టుకున్నారు. లగడపాటి అమ్ముడుపోయారనే ముద్ర వేసుకున్నారని ఓ రాజకీయ ప్రముఖుడు వ్యాఖ్యానించారు.

భ్రమ కల్పించే ఎత్తుగడ
తెలంగాణ ఓటర్‌ స్పీడుగా మారుతున్నాడని భ్రమ కల్పించేందుకు లగడపాటి చాకచక్యంగా వ్యవహరించారు. నిన్న ఆలోచన ఈ రోజు లేదు, ఈ రోజుది రేపు ఉండదంటూ చెప్పారు. ఓటరును మార్చే మైండ్‌గేమ్‌ అందులో కన్పిస్తోంది. ఎక్కువ ఓటింగ్‌ జరిగితే అది కూటమికి అనుకూలమని చెప్పడం వెనుక కుట్ర తెలుస్తోంది. మొత్తం మీద ఓటర్లను ప్రభావితం చేసేలా చంద్రబాబుకు అనుకూలంగా లగడపాటి వ్యవహరించినట్టు వెల్లడవుతోంది.

లగడపాటి సర్వేతో బెట్టింగ్‌ రాయుళ్ల కుదేలు
ఆంధ్ర ఆక్టోపస్‌గా చెప్పుకునే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే మీద ఉన్న నమ్మకం వందలాది మంది నిండా మునిగారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిన జోస్యం కారణంగా మహాకూటమిపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్‌ కట్టిన వేలాది మంది చేతులు కాల్చుకుని లబోదిబోమంటున్నారు. మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల ముందు ఆయనతో సర్వే వివరాలు పలికిస్తే తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతారన్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టడంతో ఆయన సామాజికవర్గమంతా గగ్గోలు పెడుతోంది. నమ్ముకుంటే నట్టేట ముంచాడంటూ వారంతా లోలోన రగిలిపోతున్నారు. ఇలా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారు రూ.1,200 కోట్లకు పైగా వారు నష్టపోయినట్లు అంచనా.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుండడంతో టీడీపీ నేతలు వెనకుండి లగడపాటితో సర్వే పేరుతో పాచికలు వేశారని వారంతా అనుమానిస్తున్నారు. మహాకూటమి గెలుస్తుందని పందాలు కట్టిన వారంతా చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌వైపు మారేందుకు ప్రయత్నాలు చేసినా, అప్పటికే సమయం మించిపోవడంతో వారికి పందాలు దొరకని పరిస్థితి నెలకొంది. సర్వే తుస్‌మందని ఓ వైపు అందరు అంటుంటే ఆయన మాత్రం మరోవిధంగా లబ్ధిపొందారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు