56% యువత, ఉద్యోగులే..

25 Oct, 2023 03:28 IST|Sakshi

వందేభారత్‌ ప్రయాణికులపై రైల్వే సర్వే

తక్కువ ప్రయాణ సమయం.. విలాసవంతమైన అనుభూతే కారణం

పట్టాలెక్కిన కొద్ది నెలల్లోనే ప్రయాణికులను వేగంగా తనవైపు ఆకర్షించుకుంటోందివందేభారత్‌ రైలు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి రూట్లలో మూడు వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మూడింటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతానికి పైగానే నమోదవుతోంది.

ఆ రూట్లలో రెండో వందేభారత్‌ రైలును ప్రవేశపెట్టినా, ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ రైళ్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్న కేటగిరీలపై ఓ సర్వే నిర్వహించింది. మొత్తం ప్రయాణికుల్లో 56 శాతం మంది యువకులు, ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్టు తేలింది.     –సాక్షి, హైదరాబాద్‌

యువకులే ఎక్కువ    
వందేభారత్‌ రైళ్లలో సగటున 29.08 శాతం యువతీయువకులే ఉన్నారు. 25–34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నట్టు తేలింది. వేగంగా గమ్యం చేరుతుండటంతో ఈ రైలులో ప్రయాణానికే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చదువు, ఉద్యోగ ప్రయత్నం, టూర్లు.. ఇతర పనులకు వెళ్లేందుకు ఈ రైలు వైపే మొగ్గు చూపుతున్నారు.

ప్రయాణ సమయం తక్కువగా ఉండటంతో పనులు వేగంగా చేసుకునే వీలు ఉండటం వీరికి కలిసి వస్తోంది. భద్రత పరంగా మెరుగ్గా ఉండటంతో ఒంటరిగా వెళ్లే యువతులు ఇందులో ప్రయాణించేందుకే ఇష్టపడుతున్నారు. ఈ రైలు ఒకవైపు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం వరకు, రెండో వైపు మధ్యాహ్నం బయలు దేరి రాత్రి 11 వరకు గమ్యం చేరుతోంది. దీంతో అది సురక్షిత సమయంగా యువతులు అభిప్రాయపడుతున్నారు. 

ఉద్యోగులూ ఎక్కువే
వందేభారత్‌ రైళ్లలో 26.85 శాతం మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్లు సర్వేలో తేలింది. గరుడ ప్లస్‌ బస్సు చార్జీతో వందేభారత్‌ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు ఉండటాన్ని ఉద్యోగులు పరిగణిస్తున్నారని రైల్వే అధికా­రులు చెబుతున్నారు.

వందేభారత్‌ దెబ్బ­కు కొన్ని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు టికెట్‌ చార్జీలను సవరించే పరిస్థితి వస్తోందంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చని అంటున్నారు. ఈ సర్వే నివేదికను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లామని, దాని ఆధారంగా వందేభారత్‌ రైళ్లలో మరిన్ని మార్పు చేర్పులు చేసే వీలుందని పేర్కొంటున్నారు. కాగా, 11.81 శాతం మంది వయో వృద్ధులు ఉంటున్నట్టు తేలింది. 

ప్రయాణాన్ని ఆస్వాదించండి
వేగంగా గమ్యం చేరటంతోపాటు ప్రయాణికులు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు వందేభారత్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల అవసరాలు గుర్తించి వాటిని ఎప్పటి­కప్పుడు మరింత ఉన్నతీకరిస్తున్నాం. అనతికాలంలోనే లక్షల మంది వాటిల్లో ప్రయాణించారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మిగతా ప్రయాణికులు కూడా వాటి సేవలను పొందాలని ఆశిస్తున్నాం.      – అరుణ్‌కుమార్‌ జైన్, జీఎం, దక్షిణ మధ్య రైల్వే   

మరిన్ని వార్తలు