బీజేపీని వదిలి తప్పు చేశా..

26 May, 2018 18:59 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు (పాత ఫొటో)

సాక్షి, విజయవాడ :  భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని వీడి తప్పు చేశానని కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు  పశ్చాత్తాప పడ్డారు.  దాదాపు 12 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్యాయం చేయలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తుందని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలను నిజం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. కానీ బీజేపీపై దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్యాకేజీయే గొప్పదని చంద్రబాబే చెప్పారని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ అదనంగా రూ. 70 వేల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఇన్ని ఇచ్చినా ఏమీ ఇవ్వలేదని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సమస్యల ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఉన్నాయన్నారు. అయితే ఇందుకు కిందిస్థాయిలో వేరే కారణాలు ఉన్నట్లు చెప్పారు.

2019లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. స్నేహం మాటున బీజేపీకి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వెన్నుపోటు పొడిచిందని చెప్పారు. ఆ పార్టీతో పొత్తు తెగిన అనంతరం సంకెళ్లు తెగిపడినట్లు బీజేపీ కార్యకర్తలు సంతోషిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సమయం వచ్చినప్పుడు విచారణ జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు