మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్‌

30 Nov, 2019 14:23 IST|Sakshi

అసెంబ్లీలో ప్రారంభమైన బలపరీక్ష

సభ నుంచి వాకౌట్‌ చేసిన బీజేపీ

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కీలకమైన బలపరీక్షకు సిద్ధమయ్యారు. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముందుగా సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్‌ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆయన స్థానంలో ఎన్సీపీకి చెందిన దిలీప్‌ను నూతన ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కనీసం వందేమాతరం కూడా ఆలపించలేదని ప్రభుత్వంపై పఢ్నవిస్‌ విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్‌ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విశ్వాస పరీక్షను ప్రారంభిస్తున్నామని, సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని ప్రొటెం స్వీకర్‌ కోరారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మొత్తం 288 స్థానాలకు గత మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సభ్యుల మద్దతు ఉంది. 29 మంది స్వతంత్ర సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నిలబడాలంటే 145 మంది సభ్యులు మద్దతు కావాలి. అయితే తమకు 170 మంది సభ్యులకు పైగా మద్దతు ఉందని  మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం సభలో ప్రకటించింది. అనంతరం ఇటీవల మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఉద్ధవ్‌ సభకు పరిచయం చేశారు. కాగా కీలకమైన బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు సభ్యులకు విప్‌ జారీచేశాయి.

మరిన్ని వార్తలు