‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్‌లో ఉన్నారు’

18 Jul, 2020 08:40 IST|Sakshi

ముంబై: అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మహారాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకూర్‌ విమర్శించారు. కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కర్ణాటక, నిన్న మధ్యప్రదేశ్‌, తాజాగా రాజస్తాన్‌లో అవే బురద రాజకీయాలకు కాషాయ దళం తెర తీసిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి ఏర్పడిన ‘మహా వికాస్‌ అఘాడీ’ ఒక సరికొత్త ప్రయోగమని, ఇది ఇతర పార్టీలకు దిక్సూచీలాగా పనిచేస్తుందని ఆమె అన్నారు.
(చదవండి: రసవత్తరంగా రాజస్తాన్‌ డ్రామా)

మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం స్థిరంగా ఉందని ఆమె వెల్లడించారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పైనా ఆమె ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల ముందు పార్టీ మారి వచ్చిన నేతలను చుట్టూ చేర్చుకుని ఫడ్నవీస్‌ వెలగబెట్టేది ఏంటో. ఇదే చెబుతోంది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా తయారైందో. ఇతర పార్టీల నుంచి వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఫడ్నవీస్‌ వెంట ఉండేది ఎంత మంది? బీజేపీకి ఇప్పుడు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, కాంగ్రెస్‌ నుంచి వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు మాతో టచ్‌లో ఉన్నారు. వారి పేర్లు వెల్లడిస్తే ఇప్పుడూ బీజేపీలో భూకంపమే పుడుతుంది’అని యశోమతి ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
(అంగుళం భూమినీ ముట్టుకోలేరు)

>
మరిన్ని వార్తలు