సుపరిపాలనకు మారుపేరు బీజేపీ

8 Dec, 2023 05:31 IST|Sakshi
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోదీ అభివాదం

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 

ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు 

తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో మా పార్టీ బలం పెరిగింది 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సక్సెస్‌ రేటు 56%, కాంగ్రెస్‌ సక్సెస్‌ రేటు 18%

న్యూఢిల్లీ: సుపరిపాలనకు బీజేపీ ఒక పర్యాయపదంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.  గత కొన్ని దశాబ్దాల అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేటతెల్లం అవుతోందని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్, ఇతర పారీ్టల కంటే బీజేపీ రికార్డు చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తుచేశారు. గురువారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏ ఒక్కరి ఘనత కాదని, బృంద స్ఫూర్తితో అందరూ కలిసి పనిచేయడం వల్లే చక్కటి ఫలితాలు వచ్చాయని అన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో గెలిచామని, తెలంగాణ, మిజోరం రాష్ట్రల్లో బీజేపీ బలం పెరిగిందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే సంభాíÙంచాలని బీజేపీ నేతలకు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ఉదాహరణకు ‘మోదీజీ కీ గ్యారంటీ’ బదులు ‘మోదీ కీ గ్యారంటీ’ అనాలని చెప్పారు.  

ఇదిగో మా సక్సెస్‌ రేటు  
కాంగ్రెస్‌ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు 40 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొందని, కానీ, ఏడుసార్లు మాత్రమే గెలిచిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ సక్సెస్‌ రేటు 18 శాతంగా ఉందన్నారు. బీజేపీ 39 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని 22 సార్లు నెగ్గిందని ఉద్ఘాటించారు. బీజేపీ సక్సెస్‌ రేటు 56 శాతమని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కంటే ప్రాంతీయ పారీ్టలే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.

ప్రాంతీయ పారీ్టలు 36 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని, 18 సార్లు గెలిచాయని, 50 శాతం సక్సెస్‌ రేటు సాధించాయని వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే అధికారం అప్పగించే విషయంలో ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను సమర్థవంతంగా నడిపించే శక్తి బీజేపీకి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత లేదని, సానుకూలత ఉందని వివరించారు. పారీ్టలో తాను ఒక సాధారణ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు.  

‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’లో పాల్గొనండి
తన దృష్టిలో దేశంలో పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు పెద్ద కులాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆయా కులాల సంక్షేమం కోసం కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’లో పాల్గొనాలని పార్లమెంట్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పనితీరు పట్ల తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు