నేను.. వరద కలిసి తిరగలేం

9 Nov, 2018 12:57 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న లింగారెడ్డి

అది జరిగే పని కాదు

ప్రొద్దుటూరు టీడీపీకి ఇన్‌చార్జి ఎవరూ లేరు

మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : తాను, వరదరాజులరెడ్డి కలిసి తిరగాలంటే అది జరిగే పని కాదని మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి అన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాను, వరదరాజులరెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తోందన్నారు. ప్రొద్దుటూరులోనే కాకుండా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా చేసినంత మాత్రానా అది  నియమాలను ఉల్లంఘించినట్టు కాదని తెలిపారు. గతంలో పార్టీకి ఇన్‌చార్జిగా వరదరాజులరెడ్డి ఉండేవారని, ఆ స్థానంలో సీఎం చంద్రబాబునాయుడు ఐదుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ ఆధ్వర్యంలోనే  కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇన్‌చార్జిని నియమించే వరకు సమన్వయ కమిటీ నేతృత్వంలోనే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. వరదరాజులరెడ్డి, తాను కలిసి తిరగాలంటే  అదిæ జరిగే పని కాదని.. కలుసుకోలేం కూడా అని అన్నారు. ఎవరి కార్యకర్తలు వారికి ఉంటారని, ఎవరేమి అనుకున్నా అది పొరపాటే అవుతుందని లింగారెడ్డి అన్నారు. అధిష్ఠానం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటిస్తే అది వేరేవిషయమని, గతంలో వేర్వేరుగానే తిరిగామని, ఇప్పుడు కూడా అలానే తిరుగుతున్నామని లింగారెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రొద్దుటూరు టీడీపీలో మళ్లీ విభేదాలు
వరదరాజులరెడ్డికి ఇన్‌చార్జి పదవి లేదని లింగారెడ్డి చేసిన ప్రకటనతో ప్రొద్దుటూరు టీడీపీలో కొంత కాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు బట్టబయలు అయ్యాయి. మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డిలు ఒకటయ్యారని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. పట్టణంలో ఈ వార్త అందరి నోళ్లలో నానుతోంది. లింగారెడ్డి వర్గీయులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరదకు ఇన్‌చార్జి పదవి లేదని.. ఇద్దరం ఎప్పుడు కలిసి తిరగలేమని లింగారెడ్డి చెప్పడం చర్చనీయాంశం అయింది.   సమావేశంలో టీడీపీ నాయకులు వీఎస్‌ ముక్తియార్, మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి, గాండ్లనారాయణస్వామి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు