-

బీఆర్‌ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి

12 Nov, 2023 10:52 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు.  కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని  ఓడించాల్సిందేనన్నారు. మునుగోడు కాంగ్రెస్‌ నేత పాల్వాయి స్రవంతి తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు.

పాల్వాయి స్రవంతి చేరిక సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్థం కావడం లేదన్నారు. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో ఎందుకు చేరాడు. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్‌లోనే ఉంటాను అని అనేవారు. అలాంటి పాల్వాయి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం

పాల్వాయి స్రవంతి అభ్యర్థిగా లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్‌కు వచ్చేవి కావు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. ఇప్పుడు ఒకరి భుజంపై ఒకరు చేతులేసుకొని తిరుగుతున్నారు. మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తాం. నల్లగొండ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీర్చింది కేసిఆర్’ అని కేటీఆర్‌ చెప్పారు

బీఆర్‌ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి
పాల్వాయి స్రవంతి బీఆర్‌ఎస్‌లో చేరారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘ చాలా ఆలోచించి నేను బీఆర్‌ఎస్‌లో చేరాను. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు అని నా తండ్రి చెప్పిన మాట. ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇచ్చారు. నేను పదవుల కోసం ఈ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలకు మీరు భవిష్యత్తు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరుకుంటున్న. అందరం కలిసి ముందుకు వెళ్దాం’ అని తెలిపారు.
 

ఇదీ చదవండి...శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

మరిన్ని వార్తలు