‘మరి ఇంత పదవి వ్యామోహమా..?!’

17 Dec, 2018 12:39 IST|Sakshi

పణాజి : ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి బాధ్యతలు నిర్వహిస్తోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ని సొంత పార్టీ నాయకులు అభినందిస్తోండగా.. విపక్షాలు మాత్రం అంత పదవి వ్యామోహం అవసరమా అంటూ విమర్శిస్తున్నాయి. వివరాలు.. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న పారికర్‌ అక్టోబర్‌లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న పారికర్‌ ఆదివారం తొలిసారి ప్రజల మధ్యకు వచ్చారు. అధికారులతో కలిసి పణాజీలోని మండోవి నదిపై నిర్మిస్తోన్న వంతెన పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా సీనియర్‌ నాయకురాలు ప్రీతి గాంధీ.. ‘నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం’ అంటూ పారికర్‌ని ప్రశంసించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ అధికార దాహానికి నిలువెత్తు నిదర్శనమంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ‘ఎంత అమానుషం.. పూర్తిగా కోలుకొని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫోటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణమం’టూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా విమర్శించారు.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా ‘సీఎం ముక్కులో ట్యూబ్‌ ఉందా? పదవి దాహంతో ఉన్న పార్టీ(బీజేపీ) ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరుతుందా? కానీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏమైనా చేయగలదు. సీఎం సాబ్‌ జాగ్రత్త.. ఇక మీ పార్టీ గిమ్మిక్కులు కొనసాగవు’ అంటూ ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు