మనసున్న మారాజు సీఎం వైఎస్‌ జగన్‌

1 Dec, 2023 05:31 IST|Sakshi
చిన్నారి హర్షిత అనారోగ్య సమస్యను సీఎం జగన్‌కు వివరిస్తున్న గుర్రప్ప, సౌమ్య దంపతులు 

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ సాయం

సీఎం జగన్‌ ఆదేశించిన 15 నిమిషాల్లోనే బాధితులకు చెక్కులు

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

సాక్షి, నంద్యాల: పేదల పక్షపాతినని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్నామని ఆయన దగ్గరికి వచ్చిన బాధితులకు తక్షణ సాయం అందజేసి మంచి మనసును చాటుకున్నారు. సీఎం జగన్‌ గురు­వా­రం అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన్ని కొంతమంది అభాగ్యులు కలిశారు.

అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నామని ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించిన సీఎం జగన్‌ వారిలో ఒకరికి రూ.లక్ష, మరొకరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని నంద్యాల కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో 15 నిమిషాల్లోనే బాధితులకు కలెక్టర్‌ చెక్కులు అందజేశారు.

జీవితాంతం రుణపడి ఉంటాం
అనంతపురం జిల్లా నార్పల మండలం బొమ్మ­కుంట గ్రామానికి చెందిన నారా పుల్లారెడ్డి (53) ఒక్క కిడ్నీతోనే పుట్టారు. ప్రస్తుతం ఆ కిడ్నీ కూడా సరిగా పనిచేయడం లేదు. కిడ్నీ ల్యాడర్‌ మందుల కోసమే నెలకు రూ.26 వేల వరకు ఖర్చవుతోంది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేక­పోవడంతో మందులు కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన బాధను సీఎం జగన్‌కు తెలియజేశారు.

తక్షణం స్పందించిన ఆయన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద బాధితునికి సాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశించిన నిమిషాల్లోనే కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి బాధితునికి రూ.5 లక్షలు అందజేశారు. తన సమస్య విన్న వెంటనే సీఎం జగన్‌ స్పందించి, సాయం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణ­పడి ఉంటానని పుల్లారెడ్డి చెప్పారు. ఆర్థిక సాయం కోసం ఎంతో మందిని వేడుకున్నా ఉప­యోగంలేకపోయిందని, వెంటనే సాయం చేసిన సీఎం జగన్‌ దేవుడంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మా పాపకు కొత్త జీవితాన్ని ఇచ్చారు
నంద్యాల జిల్లా అవుకు మండలం గోకులదిన్నె  గ్రామానికి చెందిన గుర్రప్ప, సౌమ్య దంపతులకు ఇద్దరు సంతానం. గుర్రప్ప ఆటో డ్రైవర్‌. వీరికి రెండో సంతానంగా పాప హర్షిత జన్మించింది. పాపకు మూడు నెలలున్నప్పుడు అనారోగ్యానికి గురైంది. గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి పాపను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ప్రస్తుతం పాపకు 20 నెలలు. ఆపరేషన్‌ చేయిస్తే నయమవుతుందని వైద్యులు చెప్పడంతో ఆర్థిక సాయం కోసం ఆ తల్లిదండ్రులు తిరగని చోటు లేదు.

చివరికి గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి వారి బాధను వివరించారు. స్పందించిన ఆయన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ తక్షణ సాయం కింద రూ.లక్ష చెక్కును బాధితులకు అందజేశారు. తమ చిన్నారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొత్త జీవితాన్ని ఇచ్చారని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. తమ బాధను పూర్తిగా విని వెంటనే సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు