అనారోగ్యమంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారా?

3 Dec, 2023 10:37 IST|Sakshi

కాంతిమతి ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌. మంచి కలెక్టర్‌గా ప్రజల గుర్తింపు పొందింది. ప్రస్తుతం సెక్రెటేరియట్‌లో కీలక స్థానంలో పనిచేస్తోంది. సమర్థమైన అధికారిగా మంత్రుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఆమెకు తన ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ. ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్రంగా ఆందోళన చెందుతుంది. మొహంపై చిన్న మచ్చ కనపడగానే తనకు స్కిన్‌ క్యాన్సర్‌ వచ్చిందేమోనని అన్ని పరీక్షలు చేయించుకుంది. అలాంటిదేం లేదని డాక్టర్లు చెప్పినా సమాధానపడలేదు. 

ఒకరోజు ఓ ముఖ్యమైన మీటింగ్‌లో ఉండగా గుండెలో ఏదో బరువుగా అనిపించింది. అంతే.. తనకు గుండెపోటు వచ్చిందని హడావుడిగా బయల్దేరి ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు చేసి అలాంటిదేమీ లేదని నిర్ధారించినా ఆమె మనసు శాంతించలేదు. మరో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అక్కడ కూడా అదే మాట చెప్పినా.. డాక్టర్లు ఏదో మిస్‌ అవుతున్నారంటూ తన లక్షణాల గురించి ఇంటర్నెట్‌లో విపరీతంగా బ్రౌజ్‌ చేస్తుండేది. మరోసారి కడుపునొప్పికే నానా హంగామా చేసింది. అత్యవసరమైతే వైద్యులు అందుబాటులో ఉండరని క్యాంప్‌లకు వెళ్లడం మానేసింది.

ఇదంతా ఆమె కెరీర్‌ పై కూడా దుష్ప్రభావం చూపుతోందని భర్త ఆనంద్‌ చెప్పినా పట్టించుకోవడం లేదు. తన సమస్యను అర్థం చేసుకోవడం లేదంటూ వాదిస్తోంది. దీంతో వాళ్ల మధ్య తరచూ గొడవలవుతున్నాయి. ఈ విషయమై మాట్లాడేందుకు సైకాలజిస్ట్‌ని సంప్రదించారు.  వాళ్లతో మాట్లాడిన తర్వాత కాంతిమతి (ఐఏడీ) లేదా హెల్త్‌ యాంగ్జయిటీతో బాధపడుతోందని అర్థమైంది. చిన్న చిన్న లక్షణాలను కూడా పెద్ద పెద్ద జబ్బులుగా ఊహించుకోవడమే ఈ రుగ్మత ప్రధాన లక్షణం. సైకోడయాగ్నసిస్‌ ద్వారా ఆమె సమస్యను నిర్ధారించుకున్నాక సైకోథెరపీ ప్రారంభించారు. రెండు నెలల్లోనే ఆమె తన సమస్యను అధిగమించింది. 

అనారోగ్యం గురించే ఆలోచనలు..
ఐఏడీతో బాధపడుతున్న వ్యక్తులు కాంతిమతిలానే తీవ్రమైన అనారోగ్యం వస్తుందని భయపడుతూ ఉంటారు. ఈ అనారోగ్యం ఒక్కోసారి ఒక్కోటిగా ఉండవచ్చు. దీని లక్షణాలు..

జబ్బు బారిన పడతామనే ఆందోళనతో వ్యక్తులను కలవడం, వేరే ప్రాంతాలకు వెళ్లడం మానేయడం. వ్యాధులు, వాటి లక్షణాల గురించి నిరంతరం తెలుసుకోవడం,
గుండె వేగం, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రతలను పదే పదే చెక్‌ చేసుకోవడం.చిన్న లక్షణం కనిపించగానే పెద్ద జబ్బు వచ్చిందని అనుకోవడం.
ఉదాహరణకు దగ్గు రాగానే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అని అనుకోవడ. తన లక్షణాల గురించి ఇతరులతో పంచుకోవడం, భరోసా కోరడం.
తన జబ్బేమిటో తెలుసుకునేందుకు పదే పదే వైద్యులను కలవడం.ఏ జబ్బూ లేదని డాక్టర్‌ చెప్పినా, పరీక్షల్లో తేలినా ఉపశమనం పొందకపోవడం

బాల్యానుభవాలూ కారణం..
ఐఏడీకి కచ్చితమైన కారణం స్పష్టంగా లేదు. ఇది సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమై వయసుతో పాటు తీవ్రతరమవుతుంది. సాధారణంగా ఈ కింది కారకాలు ఐఏడీకి దారితీస్తాయి. 

►తమ ఆరోగ్యం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందే తల్లిదండ్రులుంటే పిల్లలకూ ఐఏడీ రావచ్చు · బాల్యంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడితే, ఆ తర్వాత చిన్న లక్షణం కూడా తీవ్రంగా భయపెడుతుంది · విపరీతమైన ఒత్తిడి, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు · బాల్యంలో ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్‌ ఎబ్యూజ్‌కు గురైనప్పుడు · ఆరోగ్యం విషయంపై నిరంతరం ఇంటర్నెట్‌లో బ్రౌజ్‌ చేయడం. 

ఏం చెయ్యాలి? 

►మొదట ఫ్యామిలీ డాక్టర్‌ను కలసి ఎలాంటి జబ్బు లేదనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. వారు చెప్పేది నమ్మాలి. పదే పదే ఇతర డాక్టర్లను కలవడం ఆపేయాలి. 
► ఒత్తిడిని అధిగమించేందుకు రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ప్రాక్టీస్‌ చేయాలి. జాకబ్‌సన్‌ ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్‌ ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
►   శారీరక చురుకుదనం మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. 
►   పనిలో నిమగ్నమవ్వాలి. కుటుంబ, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. 
► మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. 
►  ఆందోళన కలిగించే లక్షణాల గురించి డాక్టర్‌తో మాత్రమే మాట్లాడాలి. 
►  జబ్బుల గురించి, వాటి లక్షణాల గురించి ఇంటర్నెట్‌లో వెతకడం మానుకోవాలి. అతిగా సమాచారాన్ని సేకరిస్తే అది గందరగోళానికి గురిచేసి ఆందోళన కలిగిస్తుంది.
► అప్పటికీ ఆందోళన తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. 
►  కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (సీబీటీ) ద్వారా ఆందోళనను తగ్గించుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. 
► బాడీ సెన్సేష‌న్స్‌ విషయంలో భయాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను థెరపీలో తెలుసుకోవాలి. 

-సైకాలజిస్ట్‌ విశేష్‌
- psy.vishesh@gmail.com 

>
మరిన్ని వార్తలు