‘సీఎం జగన్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు’

6 Sep, 2019 17:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వంద రోజుల పాలన గడవకముందే ఎన్నికల్లో ఇచ్చిన ఎనభై శాతం హామీలను అమలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ప్రజారంజక పాలన అందిస్తూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వానికైనా సెట్‌ అయ్యేందుకు ఆరు నెలల సమయం పడుతుందని.. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరు రోజుల సమయం కూడా తీసుకోలేదని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఒకేసారి 18 జీవోలు తీసుకువచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారని తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను సక్సెస్‌ చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. స్వార్ధ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం దొంగ హామీలతో జనాన్ని ఆశల పల్లకిలో తిప్పి మోసం చేసిందన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతిని పెంచిపోషించారని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పెకిలించి.. చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతామని తెలిపారు. 100 రోజుల పాలనలోనే అభివృద్ధిని చేతల్లో చూపిస్తూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల మన్నలను పొందుతున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు